రైతు భరోసా కు నిధులు కేటాయించి విడుదల చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
NLG: 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానం మేరకు, రైతు భరోసా కు నిధులు కేటాయించి, రైతుల అకౌంట్లో డబ్బు జమ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శుక్రవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం కర్నాటి సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ లో వ్యవసాయ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే వ్యవసాయ కొత్త రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకు అధికారులను ఆదేశించాలన్నారు. రైతు భరోసాతో పాటు, రైతు బీమా, పంటల భీమా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు వ్యవసాయ భూముల సేద్యం పనులు ప్రారంభిస్తుండగా అవసరమైన ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. ఏ విత్తనాలు ఎరువులను వాడాలో రైతులకు వ్యవసాయ అధికారులు తెలియజేయాలని కోరారు. ధరణిలో భూ సమస్యలపై రైతులు పెట్టుకున్న అర్జీలను కాలయాపన చేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు.
గుంతలు పడిన గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల మరమ్మతులు చేయాలని ఆయన అన్నారు. కొత్తగా ఎన్నికైన నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి,భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యులుతీన్మార్ మల్లన్నకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
ఇటీవల కాలంలో మృతి చెందిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పెన్న అనంతరామ శర్మ, సీనియర్ నాయకులు నన్నూరి అంజిరెడ్డి, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య, సిపిఎం మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్, ఖమ్మం రాములు, వల్లూరు శ్రీశైలం, ఎండి రబ్బాని, అచ్చిన శ్రీనివాస్, నగేష్, లక్ష్మయ్య, చెన్నయ్య, సైదులు, వెంకన్న, మండల నాయకులు కర్నాటి తుకారం, పెద్దగాని నరసింహ, కృష్ణ, శ్రీరాములు, వెంకటేశం, పడస బోయిన యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Jun 19 2024, 21:37