TS: ముగిసిన ఎలక్షన్ కోడ్.. ఇక పాలనపైనే రేవంత్ సర్కార్ దృష్టి.. చుట్టూ ముడుతున్న ఆర్థిక సమస్యలు ఉక్కిరి బిక్కిరి...
ఉక్కిరిబిక్కిరి !
చుట్టుముడుతున్న ఆర్థిక సమస్యలు
భారీగా సర్కారు పెండింగ్ బిల్లులు
ముగిసిన ఎలక్షన్ కోడ్
పాక్షికంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత
ఏడాదిగా కాంట్రాక్టర్ల ఎదురుచూపులు
వెంటాడుతున్న రైతు రుణమాఫీ
ప్రత్యామ్నాయ ఆదాయంపై ప్రభుత్వ దృష్టి
ఇక పాలనపైనే రేవంత్ సర్కార్ నజర్
ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీర్చే బాధ్యతను నెత్తికెత్తుకున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు అదనపు ఆదాయం కోసం నానా అవస్థలు పడుతుంది. ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వ లక్ష్యాలకు మధ్య భారీ అంతరం ఏర్పడటంతో దాన్ని భర్తీ చేయడంపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. పెండింగ్ బిల్లులు కాంట్రాక్టర్లనే కాదు…అధికారుల్నీ చికాకు పెడుతున్నాయి. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడు వాటిని పరుగులు పెట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఎలక్షన్ల హడావిడి ముగియడంతో ఇక సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ఆర్థికస్థితిని గాడినపెట్టే కసరత్తు ప్రారంభించారు.
ఎలక్షన్ కోడ్ ముగిసింది. ఇక సర్కారు పాలనపై సమస్త ప్రజానీకం దృష్టి నిలిపింది. అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామన్న హామీల అమలుకోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాటిలో ఇందిరమ్మ ఇండ్లు, ఆసరా పెన్షన్ల పెంపు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, ధరణి పోర్టల్ సవరణలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక చేయూత, మహాలక్ష్మి స్కీం ద్వారా మహిళలకు నెలకు రూ.2,500 బ్యాంకు ఖాతాల్లో జమ వంటి అనేక అంశాలు ఉన్నాయి. అయితే వీటన్నింటిపై రేవంత్ సర్కార్ ఇప్పుడు దృష్టి పెట్టింది. ఎలక్షన్ కోడ్ ముగియగానే గృహజ్యోతి స్కీం పరిధిలోకి వచ్చే ఇతర విద్యుత్ వినియోగదారులందరికీ ‘జీరో’ బిల్లులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది.అయితే ఇవన్నీ ఆర్థికపరమైన అంశాలు కావడంతో సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతుంది.రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు ఏడాది నుంచి బిల్లులు చెల్లించలేదు. దీనితో ఆయా పనులన్నీ సగంలో నిలిచిపోయాయి. పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రాజెక్టులతో పాటు రోడ్లు, నాళాల మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్లందరికీ కలిపి ప్రభుత్వం దాదాపు రూ.50వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్టు సమాచారం.
రెండేండ్లుగా ప్రయివేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదు. దీనితో ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు కూడా సర్కారుపై ఒత్తిడి తెస్తున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ సేవలు అందిస్తున్న డెంటల్ ఆస్పత్రులు రెండు వారాలుగా కొత్త పేషెంట్ల నమోదును నిలిపివేశాయి. ప్రభుత్వం నుంచి తమకు రావల్సిన బకాయిలు వచ్చే వరకు కొత్త కేసులు తీసుకోబోమని హైదరాబాద్ హైదర్‌గూడలోని సురక్షా డెంటల్ మల్టీ స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్ రాజోలు తెలిపారు. వివిధ సేవలకు ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలు తమకు వర్కవుట్ కావట్లేదనీ, 2004 నాటి చార్జీలనే ఇప్పటికీ వర్తింప చేస్తున్నారనీ, వాటిని సవరించాలని కోరుతున్నారు. అయితే ఆరోగ్యశ్రీ లోని 1,375 సేవల ప్యాకేజీల రేట్లనుపెంచుతూ శనివారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆగస్టు 15వ తేదీ లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్లేసి చెప్పిన విషయం తెలిసిందే. దీనికోసం దాదాపు రూ.35వేల కోట్ల నిధులు కావల్సి ఉంది. రుణమాఫీ జరిగితే, బ్యాంకర్ల నుంచి కొత్త రుణాలు తీసుకోవచ్చని రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రజల ఆకాంక్షలు, సర్కారు హామీల మధ్య భారీ ఆర్థిక అంతరం ఏర్పడటంతో ఇప్పుడు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికలు ముగియగానే పురపాలక సంఘాలు, ఎమ్‌పీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఇప్పుడు పునరాలోచన చేస్తున్నట్టు సమాచారం. బీసీ జనగణన జరిపి, రిజర్వేషన్లు ఖరారు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్లూ ఊపందుకున్నాయి. పరిస్థితి పాలకపక్షానికి అనుకూలంగా లేదని భావించిన రేవంత్ సర్కార్ ఈ ఎన్నికలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీనితో ముందస్తుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం ఆదాయవనరులు సమకూరలేదని సమాచారం. పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ బిల్లులు అధికారుల్ని మహా చిరాకు పెడుతున్నాయి. ప్రోటోకాల్ విభాగంలోని కాంట్రాక్టర్లకు ఏడాదికాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో, వారు తామిక ఎదురు పెట్టుబడి పెట్టలేమని చేతులెత్తేసినట్టు సమాచారం. దీనితో అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. పౌరసరఫరాల శాఖలోనూ పెండింగ్ బిల్లులు చెల్లిస్తే తప్ప, లారీలు తిప్పలేమని యజమానులు ఖరాఖండిగా చెప్తున్నారు. సెక్రటేరియల్‌లోని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు వాడుతున్న కార్లకు ఏడాదిగా బిల్లులు చెల్లించలేదు. ఇదే పరిస్థితి ఇతర కార్పొరేషన్లలోనూ ఉంది. కార్లకు ఈఎమ్‌ఐలు చెల్లించేందుకు అప్పుల పాలవుతున్నామని సదరు యజమానులు మొత్తుకుంటున్నారు.
ఆదాయాన్వేషణ
ఇటీవల వివిధ శాఖలపై సంయుక్తంగా సమీక్షా సమావేశం నిర్వహించిన ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించాలని అన్ని శాఖల ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. శాఖల వారీగా వారంరోజుల్లో అలాంటి ప్రతిపాదనల్ని తన దృష్టికి తెస్తే, మంత్రిమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్ స్కీం ఇప్పటికీ నత్తనడకనే సాగుతుంది. సర్కారు ఆశించిన స్థాయిలో ఆదాయం రావట్లేదు. మరోవైపు భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో భూములు సామాన్యులకు అందుబాటులో లేని స్థాయిలో ఉన్నాయి. వాటిని మరోసారి పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆందోళనా ప్రభుత్వంలో ఉంది. హెచ్‌ఎండీఏ ద్వారా భూముల అమ్మకంపై కసరత్తు జరుగుతుంది. రేవంత్ సర్కార్ ప్రాధాన్యతా క్రమంలో ఒక్కో సమస్యను పరిష్కరించాలని అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు కోరుతున్నారు. నిధులు లేకుండా పరిపాలన ఎలా సాగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ ఆ దిశగా దృష్టి పెట్టాలని ప్రజలు, పెండింగ్ బిల్లుల బకాయిదార్లు కోరుతున్నారు.
Jun 10 2024, 08:49