Flash ; నీటి పారుదల శాఖ అధికారులకు షాక్ ..!
- కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లపై ఫోకస్
- ఎక్స్‌టెన్షన్‌పై ఉన్న ఆఫీసర్లకు ఉద్వాసన
- ఐఎస్‌డబ్ల్యూఆర్‌కు మళ్లీ స్వతంత్రత
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు
- కోడ్ ముగిసిన వెంటనే ఉత్తర్వులు
నీటిపారుదల శాఖలో భారీగా బదిలీలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించారు. ఈఈ నుంచి ఈఎన్సీ వరకు అందరినీ బదిలీ చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ సర్కిళ్ల చీఫ్ ఇంజినీర్లు విరమణ పొందగా వారిస్థానంలో వేరొకరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్‌ఈలు, ఈఈలు విరమణ పొందగా, ఈ నెలాఖరున మరికొందరు విరమణ చేయనున్నారు. ఇరిగేషన్‌శాఖలో కొత్త నియామకాల ప్రక్రియ పూర్తయింది. కోడ్ ముగిశాక ఉత్తర్వులిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది.
నేడో రేపో ఉత్తర్వులు !
నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్)గా మురళీధర్‌ను తప్పించిన తర్వాత ఈఎన్సీ (అడ్మినిస్ట్రేషన్) అనిల్‌కుమార్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అనిల్‌కుమార్‌ను ఈఎన్సీ జనరల్‌గా కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. వాలంతరి (వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) డైరెక్టర్ జనరల్‌గా ఉన్న రమేశ్ అకాలమృతితో డ్యామ్‌సేఫ్టీలో ఎస్‌ఈగా ఉన్న మురళీకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఈ నెలాఖరున విరమణ పొందనున్నారు.
ఎక్స్‌టెన్షన్లకు ఉద్వాసన !
శాఖలో విరమణ పొందిన కొందరు ఎక్సెటెన్షన్‌పై కొనసాగుతుండటంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో ఆయా అధికారులకు ఉద్వాసన పలకాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సీడీవో, జనరల్, క్వాలిటీ కంట్రోల్ ఇలా అన్ని విభాగాల్లో కలిపి 10మందికిపైగా ఇంజినీర్లు ఎక్స్‌టెన్షన్‌పై ఉన్నట్లు తెలుస్తున్నది. అత్యవసరమైతే విరమణపొందిన అనుభవజ్ఞులైన ఇంజినీర్లను కన్సల్టెంట్‌గా నియమించుకొని సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
అంతర్రాష్ట్ర జల మండలి విభాగాన్ని మళ్లీ స్వతంత్రంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 2020లో నీటిపారుదల శాఖ పునర్వవస్థీకరణలో భాగంగా ఈ విభాగాన్ని కూడా ఈఎన్సీ జనరల్ కిందకు చేర్చి సీఈ పోస్టును రద్దు చేశారు. ఓంకార్‌సింగ్ పదోన్నతి రద్దు!
నీటిపారుదల శాఖ ఎస్‌ఈ ఓంకార్‌సింగ్ పదోన్నతిని ప్రభుత్వం రద్దు చేసినట్టు తెలిసింది. ఆయనకు ఇటీవలే ఈఈ నుంచి ఎస్‌ఈగా పూర్తి అదనపుబాధ్యతలు అప్పగించారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సమయంలో ఓంకార్‌సింగ్ ఈఈగా ఉన్నారు. ప్రస్తుతం బరాజ్‌పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో పదోన్నతి కల్పించడంపై విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు సమాచారం.
Jun 09 2024, 13:17