కేసిఆర్ దుకాణం బంద్ ...!
- కాంగ్రెస్ పార్టీ పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది
- వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఖాయం
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వాఖ్యలుస్క్
బీఆర్‌ఎస్ కథ ముగిసిందని, కాంగ్రె్‌సపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కిషన్ రెడ్డి తెలిపారు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. గురువారం ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఎన్నో అరాచకాలకు పాల్పడిందని, ఫలితంగా ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 14 చోట్ల మూడో స్థానానికి పరిమితమైందని, ఎనిమిది చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని తెలిపారు.
బీఆర్‌ఎస్ అధినేత, పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లోనూ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచారని చెప్పారు.గజ్వేల్, సిద్దిపేట, మెదక్‌లో బీఆర్‌ఎస్ రూ.వందల కోట్లు పంచిపెట్టినా ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని అన్నారు. పదేళ్లలో రూ.పది లక్షల కోట్లతో తెలంగాణలో అభివృద్ధి చేశామని.. అందువల్లే ప్రజలు ఎనిమిది సీట్లలో బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. మరో ఆరు చోట్ల రెండో స్థానంలో నిలిచామని, బలమైన ప్రత్యామ్నాయంగా మారామని చెప్పారు. కాంగ్రెస్ ఆరు నెలల పాలనపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, అందుకే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు తగ్గాయని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌తో పాటు ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు. పసుపు బోర్డు విషయంలో ఎన్నో విమర్శలు చేసినా.. ప్రజలు అర్వింద్‌ను గెలిపించారని చెప్పారు. ఏపీలో ప్రజల తీర్పు హర్షణీయమని అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కిషన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
Jun 07 2024, 11:34