Breaking : కాళేశ్వరం ప్రాజెక్టు పై తనిఖీలు !
- మేడిగడ్డ , అన్నారం సుందిళ్ల బ్యారేజ్ లపై ప్రత్యేక అధ్యయనం
- కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ కు 50కు పైగా ఫిర్యాదులు
- నేడు రాష్ట్రానికి జస్టిస్ పీయూష్ ఘోష్
- 7, 8 తేదీల్లో అన్నారం, సుందిళ్ల పరిశీలన
- రేపు కడెం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో మంత్రి ఉత్తమ్ పర్యటన
- మేడిగడ్డలో నేడు 16, 17 గేట్లు ఎత్తేందుకు కసరత్తు
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. 7న అన్నారం, 8న సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఈనెల 10వ తేదీలోపు బ్యారేజీలకు మరమ్మతులు/పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరిన విషయం విదితమే. నిపుణుల కమిటీ కూడా ఇప్పటికే బ్యారేజీలను పరిశీలించింది. పనులు ఎంత వరకూ చేపట్టారన్న విషయాన్ని తెలుసుకోవడానికి పీసీ ఘోష్ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.
మరోవైపు కడెం ప్రాజెక్టుతోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం పరిశీలించనున్నారు.కడెం ప్రాజెక్టులో మరమ్మతులకు ప్రభుత్వం రూ.3.81 కోట్లను కేటాయించగా... ఆ నిధులతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పనులను మంత్రి ఉత్తమ్ పరిశీలించి, తగిన ఆదేశాలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలనూ పరిశీలించనున్నారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీలో 16, 17వ నంబర్ గేట్లను బలవంతంగా ఎత్తే ప్రక్రియ గురువారం చేపట్టనున్నారు. ఈ మేరకు ఈఎన్‌సీ(జనరల్) గుమ్మడి అనిల్‌కుమార్‌తో పాటు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) ఓరుగంటి మోహన్‌కుమార్ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు.
జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు 54 ఫిర్యాదులు అందాయి. గత మే 31వ తేదీలోగా కమిషన్ కార్యాలయానికి నోటరీ ద్వారా అఫిడవిట్ రూపంలో ఫిర్యాదు చేయాలని కమిషన్ తరపున నీటిపారుదల శాఖ బహిరంగ ప్రకటన ఇచ్చింది. గడువు పూర్తయిన తర్వాత ఎన్ని ఫిర్యాదులు వచ్చాయని లెక్క తీయగా... 54 దాకా వచ్చినట్లు తేలింది. కాగా, బ్యారేజీల నిర్మాణంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన అధికారులు, ఇంజనీర్లు, మాజీ ప్రజాప్రతినిధులకు రెండో వారం లేదా మూడో వారంలో కమిషన్ నోటీసులు ఇచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది.
Jun 06 2024, 13:55