లోక్‌సభ ఎన్నికలు సమాప్తం.. ముగిసిన ఏడో దశ పోలింగ్
లోక్‌సభ ఎన్నికలు-2024లో (Lok Sabha Elections 2024) భాగంగా.. ఏడో దశ పోలింగ్ ముగిసింది. జూన్ 1న (శనివారం) ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 57 స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దీంతో.. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలుకొని జూన్ 1వ తేదీ వరకు 44 రోజులపాటు సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. జూన్ 4వ తేదీన లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ (ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా) ఫలితాలు రానున్నాయి.
తొలి దశ: ఏప్రిల్ 19వ తేదీ :20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 101 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. తొలి దశలో మొత్తం 64 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఒకే దశలో పోలింగ్ జరిగింది.
రెండో దశ: ఏప్రిల్ 26వ తేదీ: 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ రెండో దశలో మొత్తం 60.96 శాతం పోలింగ్ నమోదు అయింది
మూడో దశ: మే 7వ తేదీ: 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ మూడో దశలో మొత్తం 64.58 శాతం పోలింగ్ నమోదు అయింది.
నాలుగో దశ: మే 13వ తేదీ: 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ నాలుగో దశలో మొత్తం 69.16 శాతం పోలింగ్ నమోదు అయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ దశలోనే.. ఒకే సారి జరిగాయి.
అయిదో దశ: మే 20వ తేదీ: 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పోలింగ్ జరిగింది. ఈ అయిదో దశలో మొత్తం 62 శాతం పోలింగ్ నమోదు అయింది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. ఆ అసెంబ్లీకి తొలి దశ పోలింగ్ జరిగింది.
ఆరో దశ: మే 25వ తేదీ: 8 రాష్ట్రాలు, కేంద్రాపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఆరో దశలో మొత్తం 59.06 శాతం పోలింగ్ నమోదు అయింది. ఈ దశలో ఒడిశా అసెంబ్లీకి రెండో దశ పోలింగ్ జరిగింది.
ఏడో దశ: జూన్ 01వ తేదీ: 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఏడో దశలో సాయంత్రం 5.00 గంటల వరకు 58.34 శాతం పొలింగ్ నమోదు అయింది. ఒడిశా అసెంబ్లీకి మూడో దశ లేదా తుది దశ పోలింగ్ పూర్తి అయింది.
Jun 01 2024, 19:16