ఏసీబీ వలలో మరో నీటిపారుదల అధికారి 4గంటలు శ్రమించి అదుపులోకి..
హైదరాబాద్: నీటిపారుదల శాఖలో నలుగురు అధికారులు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు పట్టుబడ్డారు. ఓ దస్త్రం ఆమోదానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా ఎస్‌ఈ కార్యాలయంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నిఖేశ్‌లను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు..
ఇదే సమయంలో లంచం డిమాండ్‌కు సంబంధించి కీలక అధికారి ఒకరు త్రుటిలో తప్పించుకోవడంతో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన అధికారులు పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగించారు. సుమారు 4 గంటలు శ్రమించి నాలుగో వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు..
విశ్వసనీయ సమాచారం ప్రకారం... నీటిపారుదల శాఖ రంగారెడ్డి జిల్లా ఎస్‌ఈ కార్యాలయం అధికారుల్ని ఓ దస్త్రం ఆమోదం కోసం ఓ వ్యక్తి ఆశ్రయించారు. ఇక్కడే ఈఈగా పనిచేస్తున్న భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నిఖేశ్ ముగ్గురూ రూ.2.5 లక్షలు లంచం ఇస్తే ఆమోదిస్తామని డిమాండ్ చేసినట్లు తెలిసింది.
అంగీకరించిన వ్యక్తి తొలుత రూ.1.5 లక్షలు ముట్టజెప్పారు. ఇంకో రూ.లక్ష ఇవ్వాల్సి ఉంది. దీన్ని గురువారం సాయంత్రం ఈఈ కార్యాలయంలోనే తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఈలోపు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వారు నిఘా పెట్టారు. నీటిపారుదల శాఖ అధికారులు రాత్రి 8 గంటల సమయంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇదే సమయంలో లంచం తీసుకోవడంలో కీలకపాత్ర పోషించిన అధికారి అప్పుడే అక్కడి నుంచి వెళ్లిపోయారు. సుమారు 4 గంటల పాటు ఆయన ఆచూకీ కోసం శ్రమించిన ఏసీబీ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు..
May 31 2024, 12:48