రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ !
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల(telangana formation day 2024) నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. జూన్ 2న జరిపే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు ఎన్నికల సంఘం(Election Commission) అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఈసీ అనుమతితో సీఎస్ శాంతకుమారి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్(secunderabad) పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ రెండవ తేదీ కార్యక్రమానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. గన్ పార్క్ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్నారు.
జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని(sonia gandhi) ఆహ్వానించాలని కాంగ్రెస్(congress) ప్రభుత్వం నిర్ణయించింది. యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన పదేళ్ల తర్వాత తొలిసారిగా సోనియా గాంధీ ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశం, పంట రుణాల మాఫీని తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు 2024 పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని ఇటివల ఎన్నికల సంఘం తెలిపింది.
దీంతోపాటు ఎన్నికల నిర్వహణలో ప్రమేయం ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారిని సమావేశానికి పిలవవద్దని ఈసీ(EC) ఆదేశించింది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అనేక ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ క్రమంలో ఏదైనా కొత్త ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటే ఎన్నికల సంఘం అనుమతి తప్పక తీసుకోవాల్సిందే.
May 25 2024, 08:56