మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మతిభ్రమించింది
•బండి సంజయ్ పై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
•కాంగ్రెస్ అభ్యర్థి జనంలో ఉండని నాయకుడు
•కాంగ్రెస్ లో అంతర్గత కుమ్మలాటలు, రాజకీయలు ఎక్కువయ్యాయి.
బిజెపి కరీంనగర్ మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పై అవాకులు చివాకులు పేలారని, దీన్ని పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రి ఉద్యోగం కోల్పోయిన కెసిఆర్ కు పతిభ్రమించి, పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు భాస సత్యనారాయణ రావు విమర్శించారు. శుక్రవారం కరీంనగర్లోని పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆయన పార్టీ బిఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పి గద్దె దించిన వాళ్ల తీరు మారలేదన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అసత్య ప్రచారాలు చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ దాదాపు 12,000 వేల కోట్ల నిధులు ప్రజా సంక్షేమం, ఇతర అభివృద్ధి పనుల కోసం తీసుకొచ్చారన్నారు . కళ్ళు ఉండి చూసేవారికి చేసిన అభివృద్ధి పనులు కరీంనగర్ పార్లమెంటు వ్యాప్తంగా కళ్ళముండే కనబడతాయని, కళ్ళు ఉన్నా కూడా నటించే వారికి ఆ పనులు కనిపించవన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా తెలియని పరిస్థితి పార్లమెంటు పరిధిలో ఉందన్నారు.
తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి , చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకుందామనే ప్రయత్నంలో ఉన్నాడని, కాంగ్రెస్ అభ్యర్థి ఏనాడు ప్రజల్లో లేడన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రజల పక్షాన ఏనాడూ నిలబడలేదని, కేవలం తన రాజకీయ అవసరాల కోసం గతంలో పిఆర్పి నుండి ఎంపీగా పోటీ చేసి కనబడకుండా పోయారని విమర్శించారు. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నికల బరిలో ఎంపీ అభ్యర్థిగా నిలిచారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రజల కోసం ఇన్నేళ్లలో ఏమైనా సేవ చేశారా..? కష్టాల్లో ఉన్న ఎప్పుడైనా ఆదుకున్నారా..? ప్రజలంతా ఆలోచన చేయాలన్నారు.
కేవలం తన రాజకీయ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలపై గాని, పార్లమెంటు పరిస్థితులపై గాని ఏమాత్రం అవగాహన లేదన్నారు. అలాంటి వ్యక్తికి ఓటు వేయడం దండుగా అనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు, రాజకీయాలు ఎక్కువ అని, అందుకే కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి పురమళ్ళ శ్రీనివాస్, హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి లు దూరమయ్యారని తెలిపారు. పార్టీ వ్యవహారాలనే చక్కదిద్దుకోనొళ్ళు ప్రజల సమస్యలను ఏం పరిష్కరిస్తారు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.
కాంగ్రెస్ రోజురోజుకి ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోతుందన్నారు. జరగబోయే పార్లమెంటు ఎన్నిక లో వార్ వన్ సైడ్ జరగనుందని, బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి సంపత్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా అధికార ప్రతినిధి సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర, సోషల్ మీడియా కన్వీనర్ ఉప్పర పల్లి శ్రీనివాస్ ,నాయకులు అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
May 14 2024, 10:21