సీఎం రేవంత్ రెడ్డికి ఈసీ నోటీసులు
- 48 గంటలు డెడ్‌లైన్.. దాటితే చర్యలే..!
ఓవైపు లోక్ సభ ఎన్నికలకు రెండు రోజులు మాత్రమే సమయం ఉండగా.. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి (Anumula Revanth Reddy) ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrashekar Rao) పై వ్యక్తిగత దూషణలపై బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు.. సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం (మే 10న) షోకాజు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.
బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్ నిరంజన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈ నోటీసులపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నిరంజన్‌ను ఈసీ ఆదేశించింది. గడువు ముగిసేసరికి వివరణ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరించారు.
కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో.. మందు వేసి మాట్లాడుతుండో తెలియట్లేదు. సోయిలేనోడు, సన్నాసోడు, చవట, దద్దమ్మ, దిక్కుమాలినోడు.." అంటూ కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్రపదజాలాన్ని ఉపయోగించారు. రైతుబంధు సాయం, రైతురుణమఫీ విషయంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకున్న క్రమంలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో.. సీఎ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇవాళ సీఎంకు ఈసీ నోటీసులు ఇచ్చింది.
May 11 2024, 12:35