ఈనెల 28న వరంగల్ లో జరిగే సమూహ సభ పోస్టర్ ఆవిష్కరణ
లౌకిక విలువలు- సాహిత్యం థీమ్‌తో వరంగల్‌లో 2024 ఏప్రిల్ 28న నిర్వహించనున్న సమూహ సభను విజయవంతం చేయాలని భువనగిరిలోని సమూహ మిత్రుల ఆధ్వర్యంలో పోస్టర్, కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం గురువారం భువనగిరి పట్టణంలోని ఎస్వీ హోటల్ లో నిర్వహించడం జరిగింది. ఆవిష్కరణలో ప్రజాసంఘాల నాయకులు బట్టు రాంచంద్రయ్య కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ... దేశంలో ఫాసిస్టు ప్రమాదం పెరిగిపోతున్నదని దానికి బాధ్యుడు మోదీ అని ఆయన అన్నారు. ఈ సారి గెలిస్తే.. ఒకే దేశం- ఒకే ఎన్నిక ను అమలు చేస్తామని ఇప్పుడే ఎన్నికలకు ముందే ప్రకటిస్తూ.. దేశంలో కేంద్రీకృత అధ్యక్షతరహ పాలన ను తేదలుచుకున్నట్లు బిజెపి నేతలు స్పష్టంగానే ప్రకటిస్తున్నారని అన్నారు. ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, బిజెపి శక్తులు దేశంలో మెజారిటీ వాదాన్ని అనుసస్తూ విభజన రాజకీయాలను చేస్తూన్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కులమతాల ఆసరాతో ఓట్లను దండుకొని నియంతృత్వాన్ని నెలకొల్ప చూస్తున్న బిజెపిని ఓడించటం లౌకిక ప్రజాస్వామిక శక్తుల ముందున్న కర్తవ్యమని పిలుపునిచ్చారు. ఆ క్రమం లో ఫాసిజాన్ని ఓడించటం కోసం వరంగల్ లో నిర్వహిస్తున్న సమూహ సభను విజయవంతం చేయటానికి లౌకిక ప్రజాస్వామిక వాదులు తరలిరావాలని కోరారు.సామాజిక కార్యకర్త కోడారి వెంకటేశ్ మాట్లాడుతూ దేశంలో మతోన్మాద శక్తులు విజృంభిస్తూ అన్నిరకాల స్వేచ్ఛా స్వంతంత్య్రాలను హరిస్తున్నాయని అన్నారు. అందుకోసం స్వేచ్ఛా ప్రియులంతా ఫాసిజాన్ని ఓడించటానికి సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. సమూహ జిల్లా బాధ్యులు శేక్.హమీద్ పాశ మాట్లాడుతూ..దేశంలో నానాటికీ విజృంభిస్తున్న మతోన్మాద శక్తులు సమాజాన్ని విడదీసి ఓట్లుదండుకోవాలని చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం బిజెపి ఆర్ ఎస్ ఎస్ శక్తులు మత ఉద్రిక్తతలను ఎగదోస్తూ మెజారిటీ ఓట్లను తమ వైపు తిప్పుకొనేందుకు కుట్రలు, కుహకాలకు పాల్ప డుతున్నాయని తెలిపారు. ఈ పరిస్తితుల్లో మతోన్మాద ఫాసిస్టు శక్తులను ఓడించటమే కర్తవ్యంగా ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకం కావాల్సి ఉందని అన్నారు. డీటీఎఫ్ నేత సత్తయ్య మాట్లాడుతూ ప్రజాస్వామిక హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తూ పాఠ్యాంశాల్లో శాస్త్రీయ భావనలకు సమాధి కడుతున్న బిజెపి శక్తులను అడ్డుకోవాలని ప్రజలకు, మేధావులకు పిలుపునిచ్చారు.ఈ ఆవిష్కరన కార్యక్రమంలో టీపీఎఫ్ నాయకులు కాశపాక మహేశ్, న్యాయ వాది జిట్టా భాస్కర్ రెడ్డి, డీటీఎఫ్ నాయకులు సత్తయ్య, దయ్యాల బాలనర్సయ్య, సమూహ బాధ్యులు శ్రీనివాసా చార్యులు,సామ మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Apr 25 2024, 18:18