మృతి చెందిన గురుకుల విద్యార్థి ప్రశాంత్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలి ఆర్ వెంకట్ రెడ్డి యం వి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కు గురై 6వ తరగతి చదువుచున్న విద్యార్ధి సీహెచ్ ప్రశాంత్(12) గత ఆరు రోజులుగా చికిత్స పొందుతూ మృతిచెందడం అత్యంత బాధాకరమైన విషయని, ఎం వి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి గ్రామంలో ప్రశాంత్ తల్లిదండ్రులను, తాత, నానమ్మ, అమ్మమ్మ, మేనమామలను కలిసి ఓదార్చి, వారికి దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న రాత్రి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో ఇప్పటివరకు 27 మంది విద్యార్థులు అస్వస్థ తకు గురయ్యారని, ఐతే గమనించాల్సిన విషయం ఏమిటంటే.. భువనగిరి గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన తెలంగాణా రాష్ట్రం లో మొదటిదీ కాదు చివరిదీ కాదని ఆయన అన్నారు. తెలంగాణ
రాష్ట్రం లో సుమారు 982 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గురుకుల పాఠశాలల్లో దాదాపు 5,58,923 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఆయన తెలిపారు. కొన్ని గురుకులాల దుస్థితి, విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయమైన స్థితిలో ఉన్నాయని , అట్టహాసంగా గురుకులాలు ఏర్పాటు చేయడం, ఉన్న వాటిని జూనియర్ కాలేజీలుగా అఫ్ గ్రేడ్ చేయడం చేసారు కానీ ఉపాధ్యాయులను నియమించే ప్రక్రియను, మౌలిక వసతుల కల్పన ను గాలికి వదిలి వేసారని ఆయన ఆరోపించారు.
అత్యధిక శాతం గురుకులాలు ప్రైవేటు భవనాలలో కొన్ని జిల్లాల్లో రెండు మూడు గురుకులాలు ఒకే భవనంలో నిర్వహిస్తున్నారని , వసతుల విషయంలో కానీ భోజన విషయంలో కానీ నిర్ణయించిన ప్రమాణాలు పాటించకుండా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది విద్యార్థులు అస్వస్థకు గురైన వారు కొందరైతే, కొంత మంది ప్రాణాలు విడిచిన వారు ఉన్నారని ఆయన అన్నారు . విద్యార్థుల భోజన నాణ్యతా మీద కానీ, నాణ్యమైన విద్య అందించడంలో కానీ, తల్లిదండ్రులు బయటి వారికి ఎవ్వరికీ కూడా ఫిర్యాదు చేయవద్దని చేసిన వారికి టిసి లు ఇచ్చి పంపి వేస్తామని గురుకుల పాఠశాలల సిబ్బంది చే బెదరింపులు, అంతే కాకుండా ఈ విషయాలు అడిగిన పిల్లలను శారీకంగా హింసకు గురి చేసిన సంఘటనలు కూడా నిత్యం జరుగుతున్నాయని ఆయన అన్నారు. గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనను గాలికి వదిలి వేసారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 76% గురుకులాలు అర కొర వసతులతో అద్దె భవనాలలో నడుస్తున్నాయని ( బి. సి 119 కి 103, మైనారిటీ 204 కు 190 ,SC: 238 కు 136 అద్దె భవనాలలో). కే జీ బి వి లల్లో ఉన్న 1,00,536 ఆడ పిల్లలు మౌలిక సదుపాయాలు లేక చాల ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. రోజుకు మూడు పూటలు భోజనానికి కలిపి మొత్తం 30 రూపాయలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం
నాణ్యమైన పోషక ఆహారాన్ని అందించేందుకు బడ్జెట్ ను పెంచాలని, మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు వేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లలో అనుసరించాల్సిన ప్రమాణాలపై నిర్దిష్టమైన విధి విధానాలు రూపొందించాలని, అవి ఖచ్చితంగా అమలు అయ్యేలా తగిన పర్యవేక్షణా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని , ప్రత్యేక కమిషన్ ను వేసి గురుకుల పాఠశాలల తీరును పర్యవేక్షించాలని, ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఆయన వెంట బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్, సామాజిక ఉద్యమ నాయకురాలు బుద్ధుల సునీత లు ఉన్నారు.
Apr 18 2024, 22:32