NLG: నల్గొండలో ప్రతీ విద్యార్ధి ని ప్రయోజకున్ని చేయడమే నా లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా, ఈ నెల 5 నుంచి అందిస్తున్న ఎప్ సెట్ పరీక్షల కోచింగ్ సెంటర్ ను కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఛైర్మన్ గా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం సందర్శించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్ధులతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నల్గొండలో చదువుకోవాలనుకునే ప్రతీ విద్యార్ధికి అండగా ఉంటానని.. చదువును నిర్లక్ష్యం చేయకుండా ప్రతీ విద్యార్ధి కష్టపడి చదువుకొని పైకి రావాలని ఆకాంక్షించారు. ఇప్పటికే జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే పనులు ప్రారంభిస్తామని విద్యార్ధులకు తెలియజేశారు.
కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న ఈ కోచింగ్ కేంద్రంలో జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్న విద్యార్ధిని, విద్యార్ధులకు ఉచితంగా ఎప్ సెట్ కోచింగ్ అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఒక్క కోచింగ్ మాత్రమే కాకుండా ఉచిత హాస్టల్, భోజన వసతి మరియు ఉచిత స్టడీ మెటీరియల్ ను కూడా అందిస్తున్నామని ఆయన వివరించారు. విద్యార్ధులకు కోచింగ్ ఇవ్వడమే కాదు.. రోజువారీ పరీక్షలు, వారంతపు పరీక్షలు, గ్రాండ్ టెస్ట్ లు నిర్వహిస్తూ విద్యార్ధులను ఎప్ సెట్ కు సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు.
కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఛైర్మన్ గా శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. 300 మంది విద్యార్ధులకు ఉచిత స్టడీ మెటీరియల్ ను అందించారు. అనంతరం విద్యార్ధిని, విద్యార్ధులతో సమావేశమై వారికి అందుతున్న సౌకర్యాలు, శిక్షణ గురించి విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధుల నుంచి సానుకూల స్పందన రావడంతో కోచింగ్ సిబ్బందిని అభినందించారు.
విద్యార్ధులందరూ కష్టపడి చదువుకొని మంచి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మరియు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ కు పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులో విద్యార్ధులకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నుంచి మరిన్ని పరీక్షల శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి విద్యార్ధుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Apr 17 2024, 18:11