NLG: పచ్చల సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ: రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా మహేశ్వరుడు దీవించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని పానగల్ పచ్చల సోమేశ్వరాలయం లో మంత్రి అభిషేకం తో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ చైర్మన్, ప్రధాన అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశంలోనే ఆధ్యాత్మికపరంగా, ఆర్కియాలజీ పరంగా ప్రత్యేకమైన దేవాలయం నల్గొండలోని పచ్చల సోమేశ్వరాలయం, చాయా సోమేశ్వరాలయాలు విలసిల్లుతున్నాయన్నారు. ఛాయా సోమేశ్వరాలయాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆర్కేయాలజీ నిపుణులు వచ్చి పరిశీలించారన్నారు.
ఇంతటి మహత్యం కలిగిన ఈ ఆలయాలలో పూజలు జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు.
వచ్చే సంవత్సరం శివరాత్రి నాటికి ఈ ఆలయాలన్ని మరింత అభివృద్ధి చేస్తామని, శివరాత్రి పర్వదినం రోజునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సైతం రావడం చాలా సంతోషమని తెలిపారు. సమాజంలోని మహిళలు అన్ని రంగాలలో ముందుకు వచ్చి అభివృద్ధి చెందాలని, తమది మహిళల సంక్షేమ ప్రభుత్వమని, ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించామని, మహిళలు ఉచిత బస్సులో ప్రయాణించి ఆలయాలను సందర్శించుకోవడం చాలా సంతోషం కలిగిస్తున్నదని అన్నారు.
ఇప్పటికే మహిళలకు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. త్వరలోనే భద్రాద్రి రామయ్య పాదాల దగ్గర మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయబోతున్నామని, ప్రతి మహిళకు, మహిళా సంఘాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఆలయ చైర్మన్ సూర మహేష్, స్థానిక కౌన్సిలర్ ఆలకుంట్ల రాజేశ్వరి మోహన్ బాబు, పలువురు కౌన్సిలర్లు, స్థానిక ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.
Mar 08 2024, 17:13