TS: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి: సీఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా: గుజరాత్‌లా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెద్దన్నలా ప్రధాని మోడీ సహకరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మోడీ పలు అభివృద్ధి పనులకు శంఖు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ పడితే ప్రజలకు నష్టమని.. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ల మధ్య సామరస్య పూర్వక వాతావరణం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ సమస్యలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. పలు అంశాలపై కేంద్ర సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు పోతామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మూసీ నది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
స్కైవేల నిర్మాణానికి డిఫెన్స్ భూములను ఇచ్చారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించింనందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం కారణంగా పదేళ్లలో రామగుండం ఎన్టీపీసీ లో 1600 మెగా వాట్ల విద్యుదుత్పత్తి మాత్రమే జరిగిందన్నారు. దేశం 5 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలంటే తెలంగాణ కూడా డెవలప్ కావాలని ఆకాంక్షించారు.
Mar 06 2024, 08:53