NLG: ఆర్థికపరమైన అంశాలపై అవగాహన కోసం 2 కే రన్.
నల్లగొండ: ఆర్థికపరమైన అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించే నిమిత్తం, ఆర్ బీ ఐ ఆదేశాల మేరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ భారియా తెలిపారు. జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో, ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలపై ఏర్పాటు చేసిన 2 కె రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడంతోపాటు, ప్రతి ఒక్కరిని ఆర్థిక అంశాల పట్ల సాధికారత కల్పించే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈనెల 26 నుండి మార్చి 1 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా యువతపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతున్నదని, ప్రజలు బ్యాంకు కార్యకలాపాలపై పూర్తి అవగాహన కలిగి ఉండడంతో పాటు, బ్యాంకు ఖాతాను ఎలా ప్రారంభించాలి? ఏదైనా అనుమానాస్పద నంబర్ నుంచి మెసేజ్ లేదా కాల్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా చేపట్టే చర్యలు, తదిత అంశాలపై ఈ వారోత్సవాలలో వివరించడం జరుగుతుందని తెలిపారు.
ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిరంతరం చేస్తున్నప్పటికీ ప్రత్యేకించి ఈ వారం రోజుల పాటు ,అన్ని బ్యాంకులు ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఎస్ బి ఐ రీజినల్ మేనేజర్ అలీముద్దీన్, ఎల్డీఎం శ్రామిక్, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, మెప్మా పిడి కరుణాకర్ ,యూబీఐ చీఫ్ మేనేజర్ రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
Feb 29 2024, 15:53