ఏపీకి మిధిలీ తుపాను గండం
ఏపీకి మిధిలీ తుపాను గండం, బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం, భారీ వర్షాలతో తమిళనాడు విలవిల
ఆగ్నేయ బంగాళాఖాతం & ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవులపై అల్పపీడనం ఏర్పడింది. నవంబర్ 15న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది.
నవంబర్ 16 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. తుఫానుగా బలపడితే దీనికి మిధిలీ అని నామకరణం చేయనున్నారు.
ఈ సారి తుపానుకు పేరును మాల్దీవులు సూచించింది. ఈ మిధిలీ తుఫాను వాయువ్య దిశగా పయనించి నవంబర్ 16న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని తీవ్ర అల్పపీడనంగా మారుతుందని ఈరోజు వాతావరణ సంస్థ తెలిపింది. ఈశాన్య దిశగా సాగి నవంబర్ 17న ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలోకి తుపానుగా మారుతుందని హెచ్చరించింది. దీని ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీయనున్నాయి.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. నగరంలో నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. చెన్నైలోనూ, శివారు ప్రాంతాల్లోనూ బుధవారం నాడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే కారైక్కాల్, కడలూరు, విల్లుపురం, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. పుదుచ్చేరిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తమిళనాడు కోస్తా ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తమిళనాడు రాష్ట్రానికి ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. చెన్నై సహా ఉత్తరాది జిల్లాల్లో రాబోవు మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో కుండపోతగా, మరికొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు జాలర్లు చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు.
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల వల్ల అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు భారీగా వర్షాలు కురవటం ఆనవాయితీ. ఈ రుతుపవన ప్రభావిత వర్షాలే భూగర్భ జలాల నీటిమట్టాన్ని పెంచి పంటలకు సాగుజలాలను సకాలంలో అందేలా చేస్తాయి. ఈశాన్య రుతువపనాల వల్ల, బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాల వల్ల రాష్ట్రంలో యేడాది మొత్తం కురిసే వర్షంలో యాభైశాతం వర్షాలు కురుస్తాయి. ఈ యేడాది ఈశాన్య రుతుపవనాలు గత అక్టోబరు 21న ప్రారంభమయ్యాయి. తొలి రెండు వారాల్లో ఆశించినంతగా వర్షాలు కురవలేదు.
దక్షిణాది జిల్లాల్లో మాత్రం చెదురుముదురు వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి కన్నియాకుమారి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అటుపిమ్మట బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, పెనుగాలుల కారణంగా ఓ మోస్తరుగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం పడమటిదిశగా ఈశాన్య దిశగా కదులుతూ గురువారం ఉదయం వాయుగుండంగా మారుతుందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ వాయుగుండం ఒడిశా వైపు తీరం దాటే అవకాశాలు ఉండటం వల్ల రాష్ట్రంలో చెన్నై సహా ఉత్తరాది జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్రతీర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో చెదురుముదురగా వర్షాలు కురుస్తాయన్నారు.
రబోవు రెండు రోజుల్లో కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. వచ్చే రెండు రోజుల్లో చెన్నై, రాణిపేట, తిరువళ్లూరు, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, పుదుకోట, తిరుచ్చి, తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం, మైలాడుదురై జిల్లాల్లో భారీగా వర్షాలు కురవనున్నాయి. ఇదిలా వుండగా మంగళవారం నాగపట్టినం జిల్లాలో భారీ వర్షం కురిసింది. రంగంలోకి దిగిన అధికారులు.. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Feb 10 2024, 09:58