పాడి పశువుల కొనుగోలు మాటున రూ.2,887 కోట్ల భారీ కుంభకోణం:నాదెండ్ల మనోహర్
చేయూత స్కీమ్ పేరుతో వైసీపీ స్కామ్
బీహార్ దాణా స్కామ్ కంటే పెద్ద కుంభకోణం
3.94 లక్షల పాడి పశువులు కొనుగోలు చేశామని అసెంబ్లీలో చెప్పారు
అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలనలో ఉన్నవి కేవలం 8 వేల పాడి పశువులు మాత్రమే
పాడి పశువుల కొనుగోలు పేరుతో కొల్లగొట్టిన సొమ్ములు ఎటు పోయాయి?
అక్కచెల్లెమ్మలను నిండా మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం
లక్షల పాడి పశువులు కొని ఉంటే పాల వ్యాపారంలో రూ.14 వేల కోట్లకుపైగా ఆర్థిక లావాదేవీలు జరిగేవి
పాల వెల్లువ కాదు... వైసీపీ పాపాల వెల్లువ నడుస్తోంది
పాడి పశువుల కొనుగోలుపై సమగ్ర విచారణ చేపట్టాలి... ప్రజా ధనాన్ని వెనక్కి తీసుకురావాలి
తెనాలి మీడియా సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
పాడి పశువుల కొనుగోలు, పంపిణీ మాటున వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణం చేశారు... ఈ కుంభకోణం విలువ రూ.2,887 కోట్లు అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు. లక్షల కొద్దీ పాడి పశువులు కొనుగోలు చేశామని శాసన సభలో ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్కలకు, క్షేత్ర స్థాయిలో అధికారులు చేసిన పరిశీలనలో తేలిన లెక్కలకు అసలు పొంతనే లేదని అన్నారు. అధికారుల పరిశీలనలో ఉన్నవి కేవలం 8 వేలు మాత్రమే అని తెలిపారు. వైఎస్సార్ చేయూత స్కీమ్ కింద పశువుల కొనుగోలులోనే దాదాపు రూ. 2,887 కోట్ల అవినీతికి ఆస్కారం ఇచ్చిన ఈ స్కామ్ బీహార్ దాణా కుంభకోణం కంటే పెద్దది అని స్పష్టం చేశారు. మినీ డెయిరీల పేరుతో అక్కచెల్లెమ్మలను వైసీపీ ప్రభుత్వం నిండా మోసం చేసిందని చెప్పారు. పశువుల కొనుగోలు స్కామ్ మీద ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ... “మహిళల ఆర్థిక అభివృద్ధి, సాధికారితకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రతీ సమావేశంలో ఊదరగొడుతున్న వైసీపీ ప్రభుత్వం... క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళల ద్వారా మినీ డెయిరీలు ఏర్పాటు చేయించి పాల ఉత్పత్తి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగానూ 5.65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల్లో మహిళలను అధికారులు గుర్తించారు. 4,90,374 పాడి పశువులను చేయూత స్కీంలో కొనుగోలు చేసేందుకు అనుమతిస్తూ నవంబర్ 25, 2020లో క్యాబినెట్ తీర్మానం చేసింది. తద్వారా 20 లక్షల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
• ఒక్క రోజులో 1.85 లక్షల పాడి పశువులు పెరిగాయి
మహిళా సాధికారితపై శాసనసభలో సెప్టెంబర్ 25, 2023లో జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా మహిళ సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం 2,08,790 పాడి పశువులను కొనుగోలు చేశామని చెప్పారు. విచిత్రంగా ఆ మరుసటి రోజే వ్యవసాయ శాఖపై జరుగుతున్న చర్చలో సంబంధిత మంత్రి గారు పాల వెల్లువ పథకం కింద 3.94 లక్షల పాడి పశువులను కొనుగోలు చేశామని చెప్పారు.
ఒక్క రోజులోనే 1,85,210 పాడి పశువులు ఎలా పెరిగాయో ముఖ్యమంత్రిగానీ, సంబంధిత మంత్రులుగానీ సమాధానం చెప్పాలి. అయితే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేసిన పశు సంవర్థక శాఖ, డెయిరీ విభాగాల అధికారులకు వాస్తవంలో కనిపించినవి 8 వేల పశువులు మాత్రమే. ఒక గేదెను కొనుగోలు చేసి ఆ గేదెనే అనేకమంది కోసం కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపించారు.
అసలు లక్షల్లో పాడి పశువులు కొనుగోలు చేసి పంపిణీ చేయడం కష్ట సాధ్యమైన ప్రక్రియ. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశుక్రాంతి పథకం ద్వారా 50 వేల పాడి పశువులను కొనుగోలు చేయడానికి బీహార్, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాలు తిరిగినా సాధ్యపడలేదు. ఇప్పుడు 3.94 లక్షల పాడిపశువులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. వాస్తవంలో ఉన్నవి 8 వేల పాడి పశువులు మాత్రమే. లక్షల కొద్దీ కొన్నామని చెప్పి కోట్ల ప్రజాధనం దోచేశారు. ప్రభుత్వం తీసుకొచ్చింది పాలవెల్లువ పథకం కాదు పాపాల వెల్లువ పథకం.
Dec 14 2023, 10:15