ఆర్మీ జవానుకు పోలీసుల క్షమాపణలు
AP Police Apologies: పరవాడ సంతబయలులో ఆర్మీ ఉద్యోగి అలీముల్లాపై మంగళవారం కానిస్టేబుళ్ల దాడి చేసిన ఘటనపై అనకాలపల్లి ఎస్సీ విచారం వ్యక్తం చేశారు.
ఈ తరహా ఘటనల్ని ఉపేక్షించమని ప్రకటించారు.
అనకాపల్లి జిల్లాలోని పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది పోలీసు సిబ్బంది వ్యవహరించిన తీరుకు చింతిస్తున్నామని చెప్పారు. బాధ్యులైన నలుగురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు.
అనకాపల్లి జిల్లా పరవాడ సంతబయలు వద్ద ఆర్మీజవాన్ సయ్యద్ అలీమ్ ముల్లాపై దాడి చేసిన నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. మంగళవారం సంతబయలులో జవాను అలీముల్లాతో దిశ యాప్ డౌన్లోడ్ చేయించిన తర్వాత ఓటీపీని పోలీసులు నమోదు చేసుకోవడంపై తలెత్తిన వాగ్వాదంలో అతనిపై దాడి చేసి పోలీస్ స్టేషన్కు బలవంతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.
నలుగురు కానిస్టేబుళ్లు ఆటోలో ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్న జవాను కేకలు వేయడాన్ని స్థానికులు వీడియోలో చిత్రీకరించారు. ఇదిసోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసుల దాడిని స్థానికులు అడ్డుకుని నిలదీయడంతో అతడిని వదిలేశారు. ఈ ఘటనపై బాధితుడు మంగళవారం సాయంత్రం ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో మంగళవారం రాత్రి బాధ్యుల్ని విఆర్కు పంపి విచారణ జరిపారు. జవానుపై దాడి చేసిన కానిస్టేబుళ్లను విధుల నుంచి తప్పిస్తూ జిల్లా ఎస్పీ కేవీ.మురళీకృష్ణ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
దిశ యాప్ డౌన్లోడ్ చేయించే క్రమంలో ఓటీపీ నమోదు చేసుకోవడంపై అభ్యంతరం చెప్పినందుకు జవానుపై పోలీసులు దాడి చేశారు. దాడికి పాల్పడిన కానిస్టేబుళ్లను స్థానికులు నిలదీయడంతో ఆ వీడియో వైరల్గా మారింది.
పరవాడ పిఎస్ కానిస్టేబుళ్లు ముత్యాలనాయుడు, శోభ మొదట జవానుపై దాడి చేశారు. ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ దేవల్లు, రమేష్లు బలవంతంగా ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేశారు. దీనిపై అలీముల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలను విచారించిన తర్వాత నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు.
Nov 15 2023, 17:15