వైఎస్ షర్మిలను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నాం
తెలంగాణ ప్రజలను మోసం చేసిన వైఎస్ఆర్‌టీపీని, వైఎస్ షర్మిల ను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నాం. ఆమె ఇక్కడ అవసరం లేదు. రాజకీయ ద్రోహి.. మమ్మల్ని నట్టేట ముంచింది..’ అని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు.
తెలంగాణలో తిరిగితే అడ్డుకుంటామని, ఆమె ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని వారు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు గట్టు రామచందర్ రావు, బోయిన్‌పల్లి సత్యవతి, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు డేవిడ్ శాంతరాజ్ తదితరులు మాట్లాడారు.
పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నామని చెప్పి ఆ పత్రాలను ప్రదర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును నాశనం చేశారని, తమను మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రజలను మోసం చేసిన షర్మిల వెంటనే తెలంగాణను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.
ఎవరితోనూ చర్చించకుండానే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నామని చెప్పి, మమ్మల్ని నడిరోడ్డు మీద నిలబెట్టారని ఆరోపించారు. న్యాయపరంగా ముందుకు పోతామని, మమ్మల్ని మోసం చేసిన ఆమెపై చీటింగ్ కేసులు పెడుతామన్నారు.
రెండు మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో పార్టీ వివిధ జిల్లాల సమన్వయకర్తలు గౌతం ప్రసాద్, సుధారాణి, లావణ్య, కవితా దేవి, అయూబ్ ఖాన్,యర్రవరపు రమణ,శ్రీనివాస్ నాయక్, గణేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు...
Nov 08 2023, 12:19