ఊరూరా భోజనాలు.. నేతల బెంబేలు..!
•ప్రచారంలో రోజూ రూ.లక్షల్లో 'వడ్డింపు'
హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలకు, అభ్యర్థులకు రోజువారీ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి..
ప్రచార సంరంభంలో భాగంగా.. గ్రామాల నుంచి పట్టణాల దాకా రోజూ పెద్దసంఖ్యలో సామూహిక భోజనాలు వండుతున్నారు. రోజూ వీధుల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించే వారికి నాయకులే భోజనాలు సమకూరుస్తున్నారు. దాదాపు ప్రతి గ్రామం, పట్టణంలో నిత్యం వేల మందికి భోజనాలు వండి వడ్డిస్తున్నారు.
వీటి కోసం హోటళ్లు, క్యాటరింగ్ నిర్వాహకులు పెద్దఎత్తున సరకులు కొని నిల్వ చేస్తున్నారు. నెల క్రితం వరకూ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి భారీగా కూరగాయలు, ఉల్లిగడ్డలు ఇతర సరకులు రాష్ట్రానికి వచ్చేవి. మహారాష్ట్రకు ఉత్తరాన మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో, తూర్పున ఛత్తీస్‌గఢ్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో తెలంగాణకు కూరగాయల సరఫరా తగ్గిపోయింది. ప్రస్తుతం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచే వస్తున్నాయి..
నెలక్రితం వరకూ సాధారణ రోజుల్లో హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి టోకు మార్కెట్‌కు రోజూ 21 వేల క్వింటాళ్లకు పైగా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు సగానికి సగం తగ్గిపోయినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు జాతీయ మార్కెట్లలో నిత్యావసరాలకు గత నెలరోజుల్లో గణనీయంగా డిమాండు ఏర్పడిందని టోకు వర్తకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా భోజనాలకే రోజూ రూ.లక్షల్లో వెచ్చించాల్సి వస్తోందని అభ్యర్థులు వాపోతున్నారు. దీనికి తోడు పెళ్లి ముహూర్తాలు, కార్తికమాసం, అయ్యప్పదీక్షలు మొదలవుతుండటంతో ఊరూరా అన్నదానాలతో సందడి వాతావరణం నెలకొంటోంది. ఇలా నిత్యావసరాలకు డిమాండ్ పెరగడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది..
Nov 06 2023, 09:53