మ్యానిఫెస్టో సకల జన సంక్షేమం.. ముఖ్యమంత్రి కేసీఆర్ 100 సభల్లో పాల్గొంటారు
మ్యానిఫెస్టో సకల జన సంక్షేమం.. ముఖ్యమంత్రి కేసీఆర్ 100 సభల్లో పాల్గొంటారు
రైతులు, వ్యవసాయాన్ని బలోపేతం చేసేలా బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. మ్యానిఫెస్టోలో రైతులకే పెద్ద పీట వేస్తామని, మహిళల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
వ్యవసాయానికే అత్యంత ప్రాధాన్యం
మహిళా సాధికారతకు ప్రత్యేక కార్యాచరణ
ఈ నెల 15న ప్రజల ముందుకు మ్యానిఫెస్టో
55 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కన్నీళ్లే
హామీలను ఆ పార్టీ ఎప్పుడూ నిలబెట్టుకోలే
డబ్బులుంటే హస్తం పార్టీలో టికెట్ పక్కా
డబ్బు వెదజల్లి ప్రజల్ని కొనాలని చూస్తున్నది
ఇప్పటికే కర్ణాటక నుంచి కొడంగల్‌కు 8 కోట్లు
40 చోట్ల అభ్యర్థుల్లేని పార్టీ 70 చోట్ల గెలుస్తదా?
ఇది తెలంగాణ గల్లీకి, ఢిల్లీ అహంకారానికి, గుజరాతీ దౌర్జన్యానికి మధ్య జరిగే పోరాటం
ప్రతి ఓటరు ఆడపిల్ల తండ్రిలా ఆలోచించాలి
పొన్నాల పార్టీలోకివస్తానంటే నేనే వెళ్లి ఆహ్వానిస్తా
మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి కేటీఆర్
ఇప్పటికే పెన్షన్‌దారుల మనసుల్లో సీఎం కేసీఆర్ చెరగని ముద్ర వేశారు. ఇదే సంక్షేమాన్ని కొనసాగిస్తాం. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. మ్యానిఫెస్టోకు తుదిరూపును ఇచ్చేందుకు శని, ఆదివారాల్లో సమావేశాలున్నాయి. ఈ నెల 15న మ్యానిఫెస్టోను ప్రజల ముందు ఉంచుతాం.
– మంత్రి కేటీఆర్
రైతులు, వ్యవసాయాన్ని బలోపేతం చేసేలా బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. మ్యానిఫెస్టోలో రైతులకే పెద్ద పీట వేస్తామని, మహిళల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో మీడియా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు ప్రస్తావించిన అంశాలపై మాట్లాడుతూ.. బలహీన వర్గాలు, మైనార్టీలపై దృష్టిపెడతామని, ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికులు, డయాలసిస్ రోగులు, ఒంటరి మహిళలకు లబ్ధి చేకూర్చే పథకాలు ఉంటాయని వివరించారు. ఇతర పార్టీల హామీలపైనా కేటీఆర్ స్పందించారు. నెత్తి వాడిది కాదు.. కత్తి వాడిది కాదు అన్నట్టు ఎటుపడితే అటు గోకుతున్నారని, ఎటుపడితే అటు గీకుతున్నారని ఎద్దేవా చేశారు.
సంక్షోభం వచ్చినా సంక్షేమం ఆగలేదు
'మ్యానిఫెస్టో రూపకల్పనలో ఆదాయం, బడ్జెట్ వంటి అన్ని రకాల లెక్కలేసుకుంటున్నాం. ఇచ్చిన మాటను, హామీలను నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంతకాలం సంక్షోభం వచ్చినా సంక్షేమం ఆగకుండా జాగ్రత్తపడ్డాం' అని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదని అన్నారు. 2004, 2009లో ఆ పార్టీ మ్యానిఫెస్టోలు తీసుకొంటే వైఎస్సార్ ప్రభుత్వం రెండే రెండు హామీలిచ్చింది. 9 గంటల ఉచిత విద్యుత్తు సహా మరో హామీ. ఈ రెండింటినీ కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని తెలిపారు. ఇచ్చిన హామీలను విస్మరించటమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డు అని వెల్లడించారు. బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో 95% హామీలను నెరవేర్చామని చెప్పారు.
బీజేపీ సింగిల్ డిజిట్ దాటకపోవచ్చు
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్ దాటకపోవచ్చని మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. ఆ పార్టీ 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతుందని అన్నారు.
రాష్ర్టానికి బీఎల్ సంతోష్, అమిత్‌షా, ప్రధాని మోదీ ఎవరొచ్చినా చెప్పడానికి వారికేం లేదు. ఈ రాష్ర్టానికి, ఈ దేశానికి ఒక్క మంచి పని చేసిందేమీ లేదు. ఊరికే అరుపులు బొబ్బలు. మాట్లాడితే కేసులు, కేసీఆర్ ఫ్యామిలీ కరెప్టు ఇవి తప్ప వారు చెప్పేదాంట్లో కొత్తేముంది? తొమ్మిదిన్నరేండ్ల నుంచి పాత చింతకాయ పచ్చడి.
– మంత్రి కేటీఆర్
119 సీట్లపైనా ఫోకస్
రాష్ట్రంలోని 119 సీట్లపై తాము ఫోకస్ పెడతామని, ఏ సీటునూ వదలబోమని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. జీహెచ్‌ఎంసీతోపాటు సిరిసిల్ల, కామారెడ్డి ప్రచార బాధ్యతలను తాను నెత్తికెత్తుకున్నానని వెల్లడించారు. 'జీహెచ్‌ఎంసీలో రోడ్డుషోలు, కార్నర్‌సభలు, డివిజన్ మీటింగ్స్ ఉంటాయి. సీఎం కేసీఆర్‌వి ఒకటో రెండో సభలు హైదరాబాద్‌లో ఉండొచ్చు' అని తెలిపారు. ఎన్నికలు రాజకీయ పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయని, స్థిరమైన చిత్తంతో మంచి చేయాలనుకునేవారు ప్రజాజీవితంలో అన్నింటికీ సిద్ధంగా ఉండాలని అన్నారు. వ్యక్తిగతంగా తాను మద్యం, డబ్బు పంచకుండా గెలవాలని లక్ష్యం పెట్టుకున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ 114 మంది అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారని, మిగిలిన 5 మంది అభ్యర్థులను 3, 4 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ మిగిల్చింది కన్నీళ్లే
ప్రజలకు కాంగ్రెస్ మిగిల్చింది కన్నీళ్లేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ 60 ఏండ్లు మనల్ని ఆగం చేసిందని చెప్పారు. ఓ ఆడపిల్ల తండ్రి తన బిడ్డ పెండ్లి కోసం ఎంతలా ఆలోచిస్తాడో, తెలంగాణలోని ప్రతి ఓటరు కూడా కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఎవరి చేతిలో పెడితే బాగుంటుందో ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఎవరి చేతిలో పెట్టాలి? ఆ అభ్యర్థి గుణగణాలేమిటి? ఆ పార్టీ గుణగణాలేమిటి? ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి? ఎవరు సారథ్యం వహిస్తే రాష్ట్రం బాగుంటది? అన్నది ఆలోచించాలి' అని కోరారు. సీఎం కేసీఆర్ పనితీరును ఆశీర్వదిద్దామా? ప్రతిపక్షాల మొసలి కన్నీళ్లకు మోసపోదామా? అని అడిగారు. 'కాంగ్రెస్‌కు 40 చోట్ల అభ్యర్థులు లేరు. అలాంటి పార్టీ 70-80 చోట్ల గెలుస్తామని చెప్పటం హాస్యాస్పదంగా ఉన్నది. ఇది విని వాళ్ల పార్టీ కార్యకర్తలు కూడా నవ్వుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గమనిస్తే కాంగ్రెస్‌కు 29 సీట్లకుగానూ 22-25 స్థానాల్లో అభ్యర్థులు లేరు' అని తెలిపారు.
దేశంలో కేసీఆర్ అంత పరుషంగా, పదునుగా మోదీని తూర్పారబట్టిన నేత మరొకరు లేరు. నిజంగా మేం బీజేపీకి సబ్ సర్వెంట్ అయితే 206 మైనార్టీ స్కూళ్లు పెట్టగలిగేవాళ్లమా? బీజేపీ మా ఫ్రెండ్ అయితే మైనార్టీల కోసం గొప్ప పనులు చేయగలిగేవాళ్లమా?
– మంత్రి కేటీఆర్
తెలంగాణ అభివృద్ధిని ఒక్క రాష్ట్రంలోనైనా చూపిస్తారా?
తొమ్మిదిన్నరేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని కేటీఆర్ తెలిపారు. ప్రతి సూచీలో, నీతిఆయోగ్ వంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు విడుదల చేసే ర్యాంకుల్లో తెలంగాణ అగ్రశ్రేణి రాష్ట్రంగా, ప్రగతిశీల రాష్ట్రంగా ప్రత్యేకతను చాటుకుంటున్నదని వెల్లడించారు. 'వైద్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పట్టణ, గ్రామీణ అభివృద్ధి.. ఇలా ఏ రంగాన్ని చూసినా అభివృద్ధే కనిపిస్తున్నది. తలసరి ఆదాయంలో తెలంగాణ నం.1 అని ఆర్బీఐ చెప్పింది. తెలంగాణ కాకుండా 27 రాష్ర్టాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్నాయి. ఒక్క చోటైనా బాగుచేశారా? దేశంలో రైతులకు మేలు చేసే రాష్ట్రం ఏదన్నా ఉన్నదంటే అది తెలంగాణ మాత్రమే. కండ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం ఇది' అని వివరించారు.
అబద్ధాల అమిత్‌షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంతదారుణంగా అబద్ధాలు ఎలా చెప్తారో అర్థం కావడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గింది తెలంగాణలోనేనని కేంద్రమే చెప్తుంటే, అమిత్‌షా మాత్రం అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. మేఘాలయ సీఎంను మోస్ట్ కరప్ట్ అంటూ తిట్టిన ప్రధాని మోదీ.. నాలుగు రోజుల తర్వాత మళ్లీ మేఘాలయకు ఆ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లి, ఆ పార్టీతో పొత్తు కలుపుకొన్నారని విమర్శించారు. ప్రధాని కూడా పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
రాహుల్‌గాంధీ రీడర్
రజాకార్ సినిమా తెలంగాణ బీజేపీ ఎజెండా అని కేటీఆర్ తెలిపారు. 'ఓ గుజరాతీ తెలంగాణకు స్వా తంత్య్రం కల్పించారు. ఇప్పుడు మరో గుజరాతీ వచ్చి మిమ్మల్ని మళ్లీ స్వతంత్రులను చేస్తాడు' అన్న మోదీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'తెలంగాణ దాస్య శృంఖలాలను తెంచిది సీఎం కేసీఆర్ కాదా? తెలంగాణకు స్వేచ్ఛావాయువులను అందిం చి స్వయం పాలనలో సుపరిపాలన అందిస్తున్నది కేసీఆర్ కాదా?' అని అడిగారు. రాహుల్‌గాంధీ లీడర్ కాదు ఓ రీడర్ అని ఎద్దేవా చేశారు. ఇక్కడికి వచ్చి ఎవరో రాసిచ్చింది చదివి పోతారని విమర్శించారు.
ఈ నెల 28 వరకు సీఎం కేసీఆర్ పర్యటనలు ఖరారయ్యాయి. ఈ విడతలో సీఎం కేసీఆర్ 41 సభల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కూడా కేసీఆర్ సభలుంటాయి. మొత్తం కలుపుకుంటే కేసీఆర్ హాజరయ్యేవి దాదాపు వంద సభలుంటాయి. అవసరాన్ని బట్టి నేను. మంత్రి హరీశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తాం. స్టార్ క్యాంపెయినర్ల జాబితా సిద్ధం అవుతున్నది. మంత్రులు, సీనియర్ లీడర్లు ప్రచారంలో పాల్గొంటారు.
– మంత్రి కేటీఆర్
పొన్నాల వస్తానంటే నేనే ఆహ్వానిస్తా
కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై కేటీఆర్ స్పందిస్తూ 'పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ సీనియర్ లీడర్. ఆయన్ను మేం గౌరవిస్తాం. ఆయన బీఆర్‌ఎస్‌లో చేరతానంటే రేపే నేను ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తా' అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు వస్తాయన్న సర్వేలపై స్పందిస్తూ 'ఇవే సర్వేలు 2018లో మేం ఓడిపోతాయని చెప్పాయి. అప్పుడు, ఇప్పుడు.. ఇవే సర్వేలు, ఇవే ఏజెన్సీలు. వాళ్లే మళ్లీ మేం ఓడిపోతున్నామని చెప్పాయంటే మాకు శుభసూచకం. మళ్లీ మేమే గెలుస్తాం. వాళ్లే మళ్లీ పప్పులో కాలేశారు. రెండోసారి పప్పులో కాలేసిందునకు వారికి అభినందనలు' అని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
Oct 14 2023, 09:38