మళ్లీ మొదటికొచ్చిన బతుకమ్మ చీరలు లొల్లి
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న బతుకమ‍్మ చీరలపై ఆడపచుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు.. వాటిని తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపించటం లేదు. నేతలు ఎంత బతిమాలినా లాభం లేకుండా పోతోంది. కనీసం తీసుకున్నట్టు ఫొటోకు ఫోజు ఇవ్వమని బతిమాలితే.. తీరా తీసుకుని వాటిని ఆ నేతల ముందే చింపేస్తూ, కాల్చేస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలోని తక్కలపల్లి గ్రామానికి చెందిన మహిళలైతే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన చీరలను పెట్రోల్ పోసి మరీ తగలబెట్టేశారు.
కేసీఆర్ భార్య గానీ, కోడలు గానీ.. కూతురు కవిత గానీ ఈ చీరలు కట్టుకుంటారా?అంటూ నిలదీస్తున్నారు.
చేనేత చీరలను పంపిణీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటన చేసిన ప్రభుత్వం.. తీరా డామేజీ చీరలను ఇచ్చిందని మండిపడుతున్నారు.
కేవలం వంద రూపాయల విలువ చేసే సాధారణ చీరలు పంపిణీ చేశారనీ అన్నారు. క్రైస్తవుల పండగల సమయంలో విందులు ఏర్పాటు చేసి బహుమతులు ఇస్తారని.. ముస్లింలకు ఇఫ్తార్ విందులు, బట్టలు, కుట్టుమిషన్లు ఇస్తారని.. మరి హిందువుల పండగలకు మాత్రం నామమాత్రంగా చీరలు ఇచ్చి సీఎం కేసీఆర్ చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఇదిలా ఉంటే.. కొత్తూరు మండలం ఎస్బీపల్లికి చెందిన మహిళలైతే.. బతుకమ్మ చీరలను తీసుకోడానికి కూడా నిరాకరించారు. గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద స్థానిక జడ్పీటీసీ తదితర నాయకులు గ్రామంలో ఉన్న మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు.
కానీ చీరలు తీసుకోడానికి మహిళలు ముందుకు రాలేదు. చీరలు తీసుకుంటున్నట్లు కనీసం ఫొటో అయిన దిగాలని మహిళలను కొందరు బతిమాలారు. అయితే.. కొందరు మహిళలు తీసుకున్నా.. ఆ చీరలను చూసి నాసిరకంగా ఉన్నాయి అంటూ అక్కడే రోడ్డుపై పడేసి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...
Oct 08 2023, 14:53