మందుబాబులకు చేదు వార్త..
మందుబాబులకు చేదు వార్త
హైదరాబాద్: హైదరాబాద్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది. హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ సహా శివార్లలోని చెరువుల్లో గణేషుడి విగ్రహాలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేస్తోన్నారు మండపాల నిర్వాహకులు. ఆయా ప్రాంతాలన్నింట్లో కూడా సందడి నెలకొంది.
ఈ నెల 28వ తేదీన తుదిదశ గణేషుడి విగ్రహాల నిమజ్జనం జరుగనుంది. హైదరాబాద్ పాతబస్తీ, ఖైరతాబాద్ వినాయకుడు సహా నగరంలోని విగ్రహాలన్నీ ఆ రోజున హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కానున్నాయి. ఈ వేడుకను తిలకించడానికి లక్షలాది మంది భక్తులు హైదరాబాద్‌కు తరలిరావడం ఆనవాయితీగా వస్తోంది.
దీనితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేస్తోన్నారు. శోభయాత్ర సాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించనున్నారు. వాహనాలను దారి మళ్లించనున్నారు. దీనికోసం ఎక్కడికక్కడే బ్యారికేడ్లను ఏర్పాటు చేయనున్నారు.
నిమజ్జనం సజావుగా సాగడానికి ఎక్కడికక్కడ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సుమారు 3,600 సీసీ కెమెరాలు వినియోగిస్తోన్నారు పోలీసులు. సున్నిత, సమస్యాత్మక ప్రదేశాలపై డేగకన్ను వేశారు. అలాంటి చోట్ల ముందస్తు చర్యలు తీసుకున్నారు. అదనపు పోలీసు బలగాలను మోహరింపజేయనున్నారు.
తుదిదశ నిమజ్జనోత్సవం నాడు 21,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. పారా మిలటరీ బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను సైతం రంగంలోకి దింపనున్నారు. దీనిపై ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్ష సైతం నిర్వహించారు.
ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా- నిమజ్జనోత్సవం నాడు హైదరాబాద్ నగరంలోని అన్ని పోలీస్ కమిషనరేట్ల పరిధిల్లో మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. 28వ తేదీన తెల్లవారు జామున 6 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలన్నీ మూతపడనున్నాయి.
కల్లు దుకాణాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఈ రెండు రోజుల పాటు మూసివేయాల్సి ఉంటుందని హైదరాబాద్ నగర పోలీసులు ఆదేశించారు. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బుల్లో ఉండే బార్ అండ్ రెస్టారెంట్లకు మాత్రం మినహాయింపును ఇచ్చినట్లు వెల్లడించారు.
Sep 27 2023, 08:26