నేటి నుంచి ఆసియా గేమ్స్ సమరం
ఆసియా గేమ్స్-2023 ప్రధాన ఈవెంట్లకు నేటి నుంచి తెరలేవనుంది. ఈ మెగా సంగ్రామంలో భారత క్రీడాకారులు పతకాల వేటను ప్రారంభించడానికి రెడీ అయ్యారు.
భారత్ నుంచి వివిధ క్రీడాంశాల్లో మొత్తం 655 మంది క్రీడాకారులు ఈ మెగా సమరంలో పోటీ పడుతున్నారు. గత ఎడిషన్ 2018లో జకర్తాలో జరిగిన ఆసియా గేమ్స్ పోటీల్లో భారత్ మొత్తం 70 పతకాలు గెలుచుకుంది.
ఇదే భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఇక ఈసారి చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మన దేశ ఆటగాళ్లు వంద(100) పతకలతో సెంచరీ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇప్పటికే ఫుట్‌బాల్, వాలీబాల్, మహిళల క్రికెట్, టేబుల్ టెన్నిస్, రోయింగ్స్ వంటి క్రీడలు మొదలయ్యాయి. కానీ అధికారికంగా శనివారం నుంచి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ మెగా టోర్నీ ప్రధాన ఈవెంట్లు జరుగుతాయి.
బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, పురుషుల క్రికెట్, టెన్నిస్, హాకీ, కబడ్డీ, రెజ్లింగ్, ఆర్చరీ, అథ్లెటిక్స్, సెపక్ తక్రా తదితర క్రీడా అంశాల్లో భారత ఆటగాళ్లు పతకాల కోసం విదేశీ ప్రత్యర్థులతో పోటీ పడనున్నారు.
ప్రస్తుతం అన్ని క్రీడా విభాగాల్లో భారత్ దూసుకుపోతుంది. చిన్న చిన్న పోటీల్లో కాకుండా పెద్ద ఈవెంట్‌లలోనూ భారత క్రీడాకారులు సత్తా చాటుకుంటున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్‌లలోనూ పతకాలు సాధిస్తూ భారత ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికల్లో దేశ కీర్తి, ప్రతిష్టలను మరింతగా మెరుగుపరుస్తున్నారు.
ఈసారి అత్యధిక స్వర్ణాలు ఖాయం..!
కొన్ని క్రీడాంశాల్లో భారత్ స్వర్ణ పతకాలు గెలవడం ఖాయం. ముఖ్యంగా భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఈసారి బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు.
ఈ ఏడాది జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గత ఏడిషన్ ఆసియా గేమ్స్‌లోనూ బంగారు పతకం సాధించన విషయం తెలిసిందే.
ఈసారి కూడా అతను పసిడితో మెరుస్తాడని అందరూ భావిస్తున్నారు. ఇక తొలిసారి ఆసియా క్రీడాల్లో ప్రవేశ పెట్టిన క్రికెట్‌లో కూడా భారత్ పురుషుల, మహిళల రెండు విభాగాల్లో బంగారు పతకాలు సాధించడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు హాకీలోనూ టీమిండియా పటిష్టంగా ఉంది.
హాకీలో పురుషుల జట్టు, మహిళల జట్టు పసిడి గెలుచుకుంటుందనడంలో సందేహంలేదు. బ్యాడ్మింటన్‌లోనూ భారత్‌కు ఎదురులేదనే చెప్పాలి. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ జోడీ ఈసారి కూడా బంగారు పతకం సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. అలాగే మహిళల సింగిల్స్‌లో సింధుపై భారీ ఆశలు ఉన్నాయి.
ఈ ఏడాది ఫామ్‌లేమితో సతమతమవుతున్న సింధు ఆసియాగేమ్స్ పతకం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్, కిదాంబీ శ్రీకాంత్, లక్ష్యసేన్‌లు కూడా పతకాలు గెలుచుకోనే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
Sep 23 2023, 09:43