కాంగ్రెస్ వస్తే సంవత్సరానికి ఒకరు చొప్పున ఐదుగురు సీఎంలు గ్యారంటీ మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ వస్తే సంవత్సరానికి ఒకరు చొప్పున ఐదుగురు సీఎంలు గ్యారంటీ మంత్రి కేటీఆర్
అధికారం కోసం కాంగ్రెస్ నేతలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వాళ్లకు అధికారం కావాలనే లక్ష్యం తప్ప మరేమి కనిపించడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ హామీల్లో అభివృద్ది గురించి ఎక్కడైనా మాట్లాడారా అంటూ నిలదీశారు.
అధికారం కోసం కాంగ్రెస్ నేతలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వాళ్లకు అధికారం కావాలనే లక్ష్యం తప్ప మరేమి కనిపించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ హామీల్లో అభివృద్ది గురించి ఎక్కడైనా మాట్లాడారా అంటూ నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్న సత్యనారాయణ బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ఇటీవల బహిరంగ సభ పెట్టి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారని.. 55 ఏండ్లలో 11 ఛాన్స్‌లు ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. కరెంటు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, సాగు నీరు ఇవ్వలేదు, రైతు బందు ఇవ్వలేదు, ఏదీ ఇవ్వలేదు. సిగ్గు లేకుండా వచ్చి.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నరని మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చిన వాగ్ధానాలు ఇస్తున్నారని, ఎంత వస్తే అంత చెబుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ హామీల విలువ రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువగా ఉందని తనకు ఒక స్నేహితుడు సమాచారం ఇచ్చాడని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు రూ. 200 పెన్షన్ ఇచ్చినోళ్లు, ఇప్పుడు మాత్రం రూ. 4000 ఇస్తామని మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక వేళ పొరపాటునో.. గ్రహపాటునో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. 6 హామీలు అమలు చేస్తారని.. వాటిని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కటిక చీకట్లు, కరెంటు కష్టాలు గ్యారంటీ.. తాగునీటి కష్టాలు, ఆడవారికి నీటి తిప్పులు గ్యారంటీ.. ఎరువులు, విత్తనాల కొరత, పోలీస్ స్టేషన్ల ముందు నిలబడటం గ్యారంటీ.. రైతు బంధు రాం రాం, దళిత బంధు బంద్ పెడుతారనేది గ్యారంటీ.. సంవత్సరానికి ఒకరు చొప్పున ఐదుగురు సీఎంలు గ్యారంటీ.. రాష్ట్రం సంకనాకి పోవడం గ్యారంటీ.. .. అంటూ కాంగ్రెస్ గ్యారంటీలపై మంత్రి కేటీఆర్ చురకలంటించారు. డబ్బు సంచులతో దొరికిపొయిన వారిని పీసీసీ అధ్యక్షుడిని చేస్తే ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు వస్తాయని అన్నారు. కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.11వేల కోట్లు నిధులు మళ్లించారన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడ హామీలు అమలు చేయలేక, అభివృద్ధి పనులు చేయలేక చేతులు ఎత్తేశారన్నారు. కరెంటు ఛార్జీలు పెంచారని.. విద్యుత్ సంక్షోభం వచ్చిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ దగ్గర డబ్బులు తీసుకోండి.. ఓటు బీఆర్‌ఎస్‌కు వేయండి
తొమ్మిదేండ్ల తెలంగాణలో తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో ఎంతో ముందుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపాలిటీలు, గ్రామాలకు అనేక అవార్డులు వచ్చాయన్నారు. ఇంటింటికి నల్లా నీటిని అందిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును కూడా సీఎం కేసీఆర్ పూర్తి చేస్తారని, తాగునీటిని అందిస్తారన్నారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. రైతు బందు లాంటి పథకాలు అందించే సీఎం కేసీఆర్ పక్షాన ఉంటారో, రాబందు లాంటి కాంగ్రెస్ పక్షాన ఉంటారో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ వారు డబ్బులు ఇస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం బీఆర్ఎస్‌కు వేయాలని సూచించారు. ఈ గట్టున కేసీఆర్ రూపంలో రైతు బంధు ఉంది, ఆ గట్టున కాంగ్రెస్ రూపంలో రాబందులు ఉన్నారంటూ ఏ గట్టున ఉంటారో ఆలోచించుకొండంటూ సూచించారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా విజయం సాధించడం ఖాయమని, ఖమ్మం జిల్లాలోనూ బీఆర్ఎస్ అత్యధిక సీట్లు సాధిస్తుందన్నారు. ఖమ్మం జిల్లాలో కొందరు పార్టీని వీడారని, వారి సమస్యను ప్రజా సమస్యగా చెబుతున్నారని అన్నారు. స్వీయ మానసిక ఆందోళనను ప్రజల బాధగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆనాడు గోదావరి జలాలను ఎందుకు తీసుకురాలేదని కేటీఆర్ ప్రశ్నించారు.
Sep 20 2023, 17:01