అంగన్వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం..
అంగన్‌వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం..
రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మినీ కేంద్రాలను.. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌డ్రేట్ చేసింది.
అలాగే ఉద్యోగ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మినీ కేంద్రాలను.. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌డ్రేట్ చేసింది. అలాగే ఉద్యోగ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవోను జారీ చేసింది. ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50వేలు భృతి అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఉద్యోగ విరమణ అనంతరం ఆసరా పెన్షన్ మంజూరు చేయనున్నట్లు జీవోలో పేర్కొంది.
సర్వీసులో ఉన్న అంగన్‌వాడీలు మరణిస్తే తక్షణ సాయం కింద రూ.20వేలు, హెల్పర్లకు రూ.10వేలు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు. మధురానగర్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖలో ఆమె మంగళవారం అంగన్‌వాడీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత అత్యధికంగా అంగన్‌వాడీల వేతనాలను పెంచారంటూ గుర్తు చేశారు.
దేశంలోనే అంగన్‌వాడీలు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ ముందుందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్‌వాడీలకు అరకొరగా జీతాలు ఇస్తున్నారని మండిపడ్డారు. కొవిడ్ సమయంలో అంగన్‌వాడీల సేవలను గుర్తించి అవార్డులు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంగన్‌వాడీలు సమ్మె విరమించాలని సూచించారు. అంగన్‌వాడీలు కేంద్రం ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లతో సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లను నెరవేర్చామని స్పష్టం చేశారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అంగన్‌వాడీలపై ఒత్తిడి తగ్గించేందుకు యాప్ సింప్లిఫైడ్ చేస్తామన్నారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను.. అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్న మంత్రి.. ఈ సందర్భంగా అంగన్‌వాడీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో మరుగునపడిన అంగన్‌వాడీలకు, ఆత్మగౌరవాన్ని కల్పించింది సీఎం కేసీఆరేనన్నారు. రాష్ట్రం రూ.115కోట్ల భారాన్ని మోస్తుందన్నారు.
మోదీ ప్రభుత్వం కేంద్రం వాటాను 90శాతం నుంచి 60శాతానికి తగ్గించిందని.. రాష్ట్ర ప్రభుత్వాల వాటాను ప్రభుత్వం 40శాతానికి పెంచిందని చెప్పారు. కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో పెరిగిన వేతనాల ప్రకారం కేంద్ర వాటా 60శాతం ఉండాల్సి ఉండగా.. అంగన్‌వాడీ టీచర్ల వేతనాల్లో 19శాతం, హెల్పర్ల వేతనాల్లో 17 శాతం మాత్రమే ఇస్తుందని ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ వేతనాలకు తన వాటా కింద 40శాతం ఇవ్వాల్సి ఉండగా.. 80శాతం, హెల్పర్ల వేతనాల్లో 82శాతం ఉండడం సీఎం కేసీఆర్ ఔదార్యానికి, అంగన్‌వాడీలపై ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోళికెరీ, జేడీలు లక్ష్మిదేవి సునంద, అంగన్‌వాడీ టీచర్స్-హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు నల్లా భారతి, మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు వరలక్ష్మి, టీఎన్జీవో నిర్మల, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
Sep 13 2023, 09:01