అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి: సిఐటియు
నల్లగొండ జిల్లా: చింతపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు ముందు అంగన్వాడీల సమావేశం లో శనివారం, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఐసిడిఎస్ ప్రారంభించి 48 సంవత్సరాలు అవుతుంది. రానున్న రెండు సంవత్సరాలలో అర్థ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయటం లేదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70, 000 మంది అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. గత 48 సంవత్సరాలుగా ఐసిడిఎస్ లో పనిచేస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అయినా వీరికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలు ఏమి రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కల్పించలేదు. దీనివల్ల అంగన్వాడి ఉద్యోగులు చాలా నష్టపోతున్నారు.
మన పక్కనే ఉన్న తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో అంగన్వాడి ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చారు. పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటివ్ చెల్లిస్తున్నారు.
మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు అంగన్వాడీ ఉద్యోగులకు కల్పించడం లేదు,స్వయంగా ముఖ్యమంత్రి అంగన్వాడీ వర్కర్ పేరును టీచర్గా మార్చారు. కానీ టీచర్ తో సమానంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదు. అందుకు అనుగుణంగా అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి. కనీస వేతనం 26,000 చెల్లించాలి గ్రాడ్యుయేటివ్ అమలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ పెంపు, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, టీచర్కు 10 లక్షలు హెల్పర్ కు 5లక్షలు చెల్లించాలని, వేతనంతో సగం పెన్షన్ నిర్ణయించాలి. 60 సంవత్సరాల తర్వాత అంగన్వాడీ ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ కోరితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శిలు నల్ల వెంకటయ్య, ఏర్పుల యాదయ్య, అంగన్వాడి యూనియన్ మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
Sep 09 2023, 21:20