నూతన రెవెన్యూ డివిజన్ గా చండూర్.. ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
TS: నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ ను నూతన రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిట్టల్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రజల వద్ద నుండి అభ్యంతరాలు, సూచనలు నేటి నుండి 15 రోజులపాటు స్వీకరించినట్లు తెలిపారు. రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్ కు తెలుపవచ్చని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఉండగా.. నల్లగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చండూర్ ను నూతన రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో, జిల్లాలో నాలుగో రెవెన్యూ డివిజన్ గా చండూరు ఏర్పాటు కానున్నది. నల్లగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చండూరు, మునుగోడు, గట్టుప్పల్ మండలాలను మరియు దేవరకొండ డివిజన్ పరిధిలోని నాంపల్లి, మర్రిగూడ మండలాలను కలుపుకొని నూతన రెవెన్యూ డివిజన్ గా చండూరు ఏర్పాటు కానున్నది. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం చండూర్ ను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై డివిజన్ పరిధిలోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
Sep 05 2023, 07:29