టీఎస్‌పీఎస్సీ భర్తీ ప్రక్రియ వేగవంతం....
టీఎస్‌పీఎస్సీ భర్తీ ప్రక్రియ వేగవంతం
ఈ నెల అంతా పరీక్షలే
మూడో వారంలో ఎనిమిదింటి తుది ‘కీ’
మెరిట్ జాబితాల వెల్లడికి కసరత్తు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ వేగవంతం చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీతో పరీక్షలు రద్దు అయిన నేపథ్యంలో ఉద్యోగాల నియామకంలో జాప్యం లేకుండా, మరింత పారదర్శకంగా పూర్తిచేసేందుకు కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష (సీబీఆర్‌టీ) విధానాన్ని అమలుచేస్తోంది.
రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ నిర్వహించనున్న 35 సీబీఆర్‌టీ పరీక్షలతో సెప్టెంబరు నెల అంతా బిజీగా మారింది. ఫలితాల వెల్లడికి అవసరమైన కసరత్తును కమిషన్ ప్రారంభించింది. మహిళలకు సమాంతర రిజర్వేషన్లకు సంబంధించి నెలకొన్న వివాదంపై హైకోర్టు నుంచి మరింత స్పష్టత వచ్చేందుకు ఎదురుచూస్తోంది. ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబరు మొదటి వారంలో ఫలితాల వెల్లడి ప్రక్రియ చేపట్టాలని భావించినా.. న్యాయవివాదంపై స్పష్టత రాలేదు. స్పష్టత వస్తే ఈ నెలలో గానీ, అక్టోబరులో గానీ ఫలితాలు వెల్లడించి మెరిట్ లిస్టులను ప్రకటించే అవకాశాలున్నాయి. గ్రూప్-1 ఫలితాల వెల్లడి, ప్రధాన పరీక్షల షెడ్యూలు ప్రకటనకు మరింత సమయం పట్టనుంది. గ్రూప్-1పై రెండు న్యాయవివాదాలు ఉండగా.. వీటిపై స్పష్టత వస్తేనే తదుపరి ప్రక్రియ చేపట్టేందుకు వీలవుతుందని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
35 రకాల పరీక్షలకు ఏర్పాట్లు..*
పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లు, ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్లు, జూనియర్ లెక్చరర్ పోస్టుల పరీక్షలు ఈ నెల 4 నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం 35 సీబీఆర్‌టీ పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తిచేసింది. అక్టోబరులో అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టులకు సీబీఆర్‌టీ జరగనుంది. టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే 16 ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి రాతపరీక్షలు పూర్తిచేసింది. వీటి తుది ‘కీ’లను ఈ నెలలోనే వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయ అధికారులు, లైబ్రేరియన్లు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, ఉద్యాన అధికారుల పోస్టులకు రెండో వారంలో, ఏఎంవీఐ, టీపీబీవో, భూగర్భజల శాఖ, అకౌంట్స్ అధికారుల పోస్టులకు మూడో వారంలో తుది ‘కీ’ వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. గ్రూప్-4 ప్రిలిమినరీ ‘కీ’పై అభ్యంతరాలు ముగిసిన తర్వాత 15 రోజుల్లో తుది ‘కీ’ ప్రకటించనుంది.
నెలాఖరు లేదా అక్టోబరులో మెరిట్‌లిస్టు ప్రకటించి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలని భావిస్తోంది. ఆగస్టులో జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష నవంబరు నెలకు వాయిదా పండింది. గ్రూప్-3తో పాటు డీఏవో, సంక్షేమాధికారుల పోస్టుల రాతపరీక్ష తేదీలు ఖరారవ్వాల్సి ఉంది.
Sep 04 2023, 19:20