Pawan Kalyan: ఆ నిస్పృహ వెంటాడేది.. అదే చివరి సినిమాకావాలనుకున్నా: పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఈ పేరే కొందరికి ఓ మంత్రం.. ఓ బ్రాండ్.. ఓ శక్తి.. ఒకప్పుడు ఒక్క స్నేహితుడూ లేని ఆయనకు ఇప్పుడు కోట్లమంది అభిమానులు..
తొలి సినిమానే చివరి సినిమా కావాలనుకున్న ఆయన ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచారు. శనివారం పవన్ పుట్టినరోజు (Happy Birthday Pawan Kalyan) సందర్భంగా ఆ విషయాలు తెలుసుకుందాం..
ఈ ఏడాది జులైలో పవన్ కల్యాణ్ 'ఇన్‌స్టాగ్రామ్' ఖాతా తెరిచారు. ఒక్క పోస్ట్ పెట్టకపోయినా ఆయన ఫాలోవర్స్ సంఖ్య కొన్ని గంటల్లోనే మిలియన్‌కుపైగా చేరడం ఓ రికార్డు.
2014లో గూగుల్‌లో అత్యధిక మంది సెర్చ్ చేసిన ఇండియన్ సెలబ్రిటీ పొలిటిషియన్ పవన్ కల్యాణ్.
'ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలబ్రిటీస్' (2013) జాబితాలో పవన్ కల్యాణ్ 26వ స్థానంలో నిలిచారు.
కరాటేలో 'బ్లాక్ బెల్ట్' పొందిన అతి కొద్దిమంది నటుల్లో పవన్ ఒకరు.
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీలో 2017లో నిర్వహించిన 'ఇండియా కాన్ఫరెన్స్'లో పవన్ ఇచ్చిన ఉపన్యాసం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఈ అరుదైన అవకాశం పొందిన కొద్దిమంది నటుల్లో పవన్ ఒకరు.
పవన్ నటించిన 'తొలిప్రేమ' జాతీయ అవార్డుతోపాటు వివిధ విభాగాల్లో ఆరు నంది పురస్కారాలు దక్కించుకోవడం విశేషం.
'జాని', 'సర్దార్ గబ్బర్‌సింగ్'లకు కథ, 'గుడుంబా శంకర్' చిత్రానికి స్క్రీన్‌ప్లే రాసింది పవనే. 'జాని'కి దర్శకత్వం కూడా వహించారు.
'తమ్ముడు', 'బద్రి', 'ఖుషి', 'జానీ', 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్‌సింగ్' తదితర చిత్రాల్లోని కొన్ని స్టంట్స్‌కు పవన్ కొరియోగ్రఫీ చేశారు.
'గుడుంబా శంకర్'లోని అన్ని పాటలు, 'ఖుషి'లోని పలు గీతాలు, 'పంజా' టైటిల్ సాంగ్‌కు పవన్ సాంగ్స్ విజువలైజర్‌గా వ్యవహరించారు. 'తాటి చెట్టెక్కలేవు..', 'బంగారు రమణమ్మలాంటి', 'కాటమరాయుడా'వంటి బిట్ సాంగ్స్‌ను ఆలపించి ఉర్రూతలూగించిన పవన్ 'సర్దార్ గబ్బర్‌సింగ్', 'ఛల్ మోహన్‌రంగ' తదితర చిత్రాలను నిర్మించారు.
పవన్‌కు దర్శకుడు త్రివిక్రమ్ మంచి స్నేహితుడనే సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి పనిచేసిన తొలి చిత్రం 'గోకులంలో సీత'. ఈ చిత్రానికి నటుడు పోసాని కృష్ణమురళి సంభాషణలు రాశారు. అప్పట్లో త్రివిక్రమ్ ఈయన అసిస్టెంట్‌గా పనిచేశారు. అలా.. ఆ
చిత్రం కోసం త్రివిక్రమ్ రాసిన 'ప్రేమే దైవం, ప్రేమే సర్వం, ప్రేమే సృష్టి మనుడగకు మూలం' అనే డైలాగ్ పవన్‌కు బాగా నచ్చిందట. అయితే, అప్పట్లో త్రివిక్రమ్ ఎవరో పవన్‌కు తెలియదు. ఆ తర్వాత ఈ కాంబోలో 'జల్సా', 'అత్తారింటికి దారేది', 'అజ్ఞాతవాసి' సినిమాలు తెరకెక్కాయి.
సినిమాల్లోకి రాకముందు పవన్ ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో కొన్ని రోజులు, ఓ గిడ్డంగిలో రెండు రోజులు పనిచేశారు. పారా గ్లైడింగ్ చేశారు. కర్ణాటక సంగీతంలో ప్రవేశం పొందారు. వయొలిన్ సాధన చేశారు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కోర్సులో చేరారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి కొంత తెలుసుకున్నారు. విదేశీ భాషలు నేర్చుకునే ప్రయత్నం చేశారు.
వెంటవెంటనే సినిమాలు చేసేయాలనే ఆలోచన పవన్‌కు ఉండదు. తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు, అభిమానులను మెప్పించేగలిగే పవర్‌ఫుల్ రోల్స్, సందేశాత్మకమైన కథలనే ఎంపిక చేసుకుంటుంటారు. అందుకే.. 27 ఏళ్ల ప్రస్థానంలో పవన్ నటించిన సినిమాల సంఖ్య 28. వాటిలో 12 రీమేక్‌లు. ప్రస్తుతం 'ఓజీ' (OG), 'ఉస్తాద్ భగత్‌సింగ్' (Ustaad Bhagat Singh), 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) చిత్రాలతో బిజీగా ఉన్నారు.పలు సందర్భాల్లో పవన్ పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే (Happy Birthday Power Star)..
వారి వల్లే బతికా..!
''చిన్నప్పుడు ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యేవాణ్ని. అప్పట్లో నాకు స్నేహితులు లేరు. నేను ఇంటర్‌లో చేరే సమయానికి అన్నయ్య (చిరంజీవి) చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డారు. నేను ఇంటర్ పాస్‌కానని నాకు అర్థమైంది. చదువు విషయంలో అమ్మ, నాన్న నన్ను ఒక్క మాట అనకపోయినా నాలో ఏదో అపరాధభావం. 'స్నేహితులంతా జీవితంలో ముందుకెళ్లిపోతున్నారు. మనం మాత్రం ఉన్న చోటే ఉంటున్నాం' అన్న నిస్పృహ వెంటాడేది. ఆ ఒత్తిడిలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించా. కుటుంబ సభ్యులు చూడడం వల్ల బతికి బయటపడ్డా. 'నువ్వు చదివినా చదవక పోయినా మేం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. జీవితంలో స్పష్టత ముఖ్యం. ముందు, నువ్వు ఏం కావాలనుకుంటున్నావో నిర్ణయించుకో' అని ఆ సమయంలో ఇద్దరు అన్నయ్యలు (చిరంజీవి, నాగబాబు), సురేఖ వదిన అండగా నిలిచారు''
Sep 02 2023, 16:45