కాంగ్రెస్ చేతిలోకి వైఎస్ఆర్ టీపీ పార్టీ ❓️
షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనానికి సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీతో ఆమె గురువారం ఢిల్లీలో భేటీ కానున్నారు.
అనంతరం విలీనంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్ర నేతలతో చర్చలు జరిపేందుకు బుధవారం ఆమె తన భర్త అనిల్‌తో కలిసి హస్తిన చేరుకున్నారు. వైఎ్‌సఆర్‌టీపీ నేతలకు గానీ, భద్రతాసిబ్బందికి గానీ సమాచారం ఇవ్వకుండా వెళ్లినట్లు సమాచారం. సెప్టెంబరు 2న వైఎస్ వర్ధంతి ఉన్నందున ఈలోపే విలీనంపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నుంచి స్పష్టమైన హామీ లభిస్తుందని ఆమె ఆశిస్తున్నట్లు తెలిసింది.
సోనియాతో భేటీ తర్వాత విలీనం ఖరారవుతుందని.. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాలు కూడా తెలిపాయి. జగనన్న వదిలిన బాణాన్ని జగన్‌పైనే ప్రయోగించబోతున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తొలుత తెలంగాణలో ఆమె సేవలు వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావించినా.. ఆంధ్రప్రదేశ్‌లో అయితేనే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని, ఆమె ద్వారా జగన్‌ను కట్టడి చేయొచ్చని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో బీజేపీ కూడా బలహీనంగా ఉన్నందున కాంగ్రెస్ పుంజుకోవడానికి షర్మిల చేరిక లాభిస్తుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, అన్న జగన్ జైలులో ఉండగా.. ఆయన వదిలిన బాణంగా రాష్ట్రమంతటా తిరిగి వైసీపీని బలోపేతం చేసిన షర్మిల.. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ పాలుపంచుకున్నారు.
అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచాక తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. ఆస్తిలో వాటా ఇచ్చేందుకూ జగన్ నిరాకరించడంతో.. ప్రత్యామ్నాయం వైపు మళ్లారు.
తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర కూడా చేపట్టారు. తొలుత తెలంగాణకే పరిమితమైన ఆమె.. తల్లి విజయలక్ష్మిని వైసీపీ గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి జగన్ నిర్దాక్షిణ్యంగా తొలగించిన దరిమిలా ఏపీ రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలిసింది.
ఇదే సమయంలో వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా ఆమెను పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆయనతోను, ఆ పార్టీ నేతలతోను పలు దఫాలు చర్చలు జరిపిన ఆమె.. రాహుల్‌గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలియజేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. కాంగ్రెస్‌లో పార్టీ విలీనానికి ఇది సంకేతమని ఆనాడే వార్త లు వెలువడ్డాయి.
గురువారం సోనియాతో సమావేశం తర్వా త విలీన ప్రక్రియ పూర్తిగా కొలిక్కి వస్తుందని వైఎస్ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి.......
Aug 31 2023, 15:13