Yuvagalam: లోకేష్ పాదయాత్రకు రేపటితో 200 రోజులు..
లోకేష్ పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. జన నీరాజనాల మధ్య విజయవంతంగా నడుస్తోంది. లోకేష్ పాదయాత్ర రేపటితో 200వ రోజుకు చేరుకుంటోంది. రికార్డులను బద్దలుకొడుతూ లోకేష్ పాదయాత్ర ముందుకెళ్తోంది..
లోకేష్ పాదయాత్ర డబుల్ సెంచరీ రోజున టీడీపీ భారీ కార్యక్రమాలు చేపడుతోంది. పార్టీ ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొననున్నారు.
జనవరి 27న కుప్పంలో వరదరాజస్వామి ఆశీస్సులతో ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర జైత్రయాత్రను తలపించేలా సాగుతోంది. ఇప్పటి వరకు 9 ఉమ్మడి జిల్లాల్లో పాదయాత్ర పూర్తయ్యింది. 77 నియోజకవర్గాల్లో 2 వేల 710 కిలోమీటర్ల మేర నారా లోకేష్ నడిచారు. ఎండ, వాన, అలసట ఇలాంటి వాటిని పట్టించుకోకుండా పట్టువదలని విక్రమార్కుడిలా లోకేష్ యాత్ర కొనసాగిస్తున్నారు. అనివార్యమైన సందర్భాల్లో మినహా ఇప్పటివరకు విరామం లేకుండా పాదయాత్ర సాగుతోంది. అంచనాలను తలకిందులు చేస్తూ.. అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా లోకేష్ పాదయాత్ర ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు..
199 రోజుల పాదయాత్రలో 77 నియోజకవర్గాలు, 185 మండలాలు, 1675 గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు 64 బహిరంగ సభలకు లోకేష్ హాజరయ్యారు. 132 ముఖాముఖి సమావేశాలు, 8రచ్చబండ సభలు, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు బలయిన బాధితులను ఓదారుస్తూ.. దగాపడ్డ ప్రజలకు భరోసా ఇస్తూ.. టీడీపీ చేసిన అభివృద్ధి వివరిస్తూ..అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. కంటగింపుతో అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. సంయమనంతో అడ్డుకుంటూ ముందుకు సాగుతున్నారు. పదునైన మాటలతో.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ లోకేష్ ప్రసంగాలు ఉంటున్నాయి. విరామ సమయంలో నేతలు, కార్యకర్తలను కలుస్తున్నారు. పాదయాత్రలో లోకేష్‌లో సరికొత్త రాజకీయ నాయకుడు కనపడుతున్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..
Aug 30 2023, 20:35