ఆదిత్య L-1 మిషన్ కు సర్వం సిద్దం !
శ్రీహరికోట ;
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ఊపుమీద కనిపిస్తోంది. అదే ఊపులో సూర్యుడిపై ఆదిత్య ఎల్1 మిషన్ కూడా ప్రయోగించేందుకు ముహుర్తం సిద్ధం చేసేసింది. వచ్చే నెల 2వ తేదీన సూర్యుడిపైకి ఆదిత్య ఎల్ 1 నౌకను పంపేందుకు సిద్దమవుతున్నట్లు ఇస్రో ఇవాళ ప్రకటించింది. ఏపీలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 11.50 నిమిషాలకు ఆదిత్య ఎల్ 1 ను ప్రయోగిస్తున్నట్లు ఇస్రో తెలిపింది.
ఆదిత్య-L1 వ్యోమనౌక భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న L1 (సూర్య-భూమి లాగ్రాంజియన్ పాయింట్) వద్ద సూర్యుడి కేంద్రం కరోనా అధ్యయనం, సూర్యుడిపై వీచే గాలిపై పరిశోధనలు చేయడానికి అందించడానికి రూపొందించారు.ఇది సూర్యుడిపై పరిశోధనలపై చేస్తున్న తొలి భారతీయ అంతరిక్ష ప్రయోగం కూడా కానుంది. ఇస్రో తన సోషల్ మీడియా పోస్ట్‌లో అంతరిక్ష నౌక సూర్యుడిని అధ్యయనం చేయడానికి అంతరిక్ష ఆధారిత మొదటి భారతీయ అబ్జర్వేటరీ - PSLV-C57 రాకెట్ ద్వారా ప్రయోగించబడుతుందని తెలిపింది.
ఆదిత్య-L1 మిషన్, L1గా పేర్కొంటున్న పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్య నుండి సూర్యుడిని అధ్యయనం చేసే లక్ష్యంతో ప్రయోగిస్తున్నారు. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుని యొక్క బయటి పొరలను, కరోనాను వేర్వేరు వేవ్‌బ్యాండ్‌లో పరిశీలించడానికి ఏడు పేలోడ్‌లను ఇది తీసుకువెళుతుంది. ఆదిత్య-ఎల్1 అనేది జాతీయ సంస్థల భాగస్వామ్యంతో చేపడుతున్న పూర్తి స్వదేశీ ప్రయత్నమని ఇస్రో వెల్లడించింది.
చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశంగా రికార్డు సృష్టించిన భారత్ ఇప్పుడు సూర్యుడిపైనా విజయవంతంగా కాలు మోపగలిగితే అంతర్జాతీయంగా ఇస్రో పేరు మార్మోగిపోవడం ఖాయం. ఇందుకోసం ఇస్రో తీవ్రంగా శ్రమిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంతో ఇస్రో ఆదిత్య ఎల్ 1 మిషన్ ప్రయోగానికి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 2న జరిగే ఈ తొలి సౌర ప్రయోగంపై దేశవ్యాప్తంగా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Aug 30 2023, 20:28