వికలాంగుల విద్య, ఉపాధి కోసం ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలి
వికలాంగుల విద్య, ఉపాధి కోసం ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలి
ఆటిజం వినికిడి తెరపి కేంద్రాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి-సంక్షేమం, సాధికారత కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగులకు విద్యా, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక విదానాన్ని ప్రకటించాలనీ, రాష్ట్రంలో 12.2 శాతం జనాభా కలిగిన వికలాంగుల సంక్షేమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టదా అని వక్తలు ప్రశ్నించారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర కమిటీ నేతృత్వంలో వెలువడుతున్న వికలాంగుల వాయిస్ చైతన్య మాస పత్రిక 9వ వార్షికోత్సవం ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోజరిగింది. వార్షికోత్సవం ప్రత్యేక సంచికను వొకేషనల్ రేహాబిలిటేషన్ సెంటర్ మాజీ డైరెక్టర్ గంగాధర్ రావు, ఎన్పీఆర్డీ జాతీయ ఉపాధ్యక్షులు యం అడివయ్య, వికలాంగుల వాయిస్ మాస పత్రిక మేనేజర్ కే వెంకట్, అసిస్టెంట్ మేనేజర్ బి స్వామి, అసిస్టెంట్ ఎడిటర్ జే రాజు, ఎడిటోరియల్ బోర్డ్ సభ్యులు అర్ వెంకటేష్, ఎ రంగారెడ్డి, బలేశ్వర్, సాయమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడివయ్య, గంగాధర్ రావు మాట్లాడుతూ దేశంలో 2.68 కోట్ల మంది వికలాంగులు ఉంటే రాష్ట్రంలో 43.04 లక్షల మంది వికలాంగులు ఉన్నారన్నారు. రాష్ట్ర జనాభాలో వీరు 12.2శాతం ఉన్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వీరి సంక్షేమం ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు. విద్యా, ఉపాధి దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శక్తి సామర్థ్యాలను వెలికి తీయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనాభాకు అనుగుణంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలన్నారు. దేశలో 50 లక్షల మంది ఆటిజం కలిగిన వారున్నారని తెలిపారు. రాష్ట్రంలో 5 లక్షల మంది ఉన్నారనీ, వీరందరికీ ప్రభుత్వమే ఉచితంగా థెరపీ అందించేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో, రాష్ట్రంలో వినికిడి లోపం సమస్య కూడా తీవ్రంగా ఉందన్నారు. వికలాంగుల వాయిస్ మాస పత్రిక మేనేజర్ కే వెంకట్ మాట్లాడుతూ వైకల్య ధృవీకరణ పత్రాలు అందించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు.
కార్యక్రమంలో ఎన్పీఆర్డీ నాయకులు టి మధు బాబు, కాశప్ప, దశరథ్, యశోద, పి కవిత, అరిఫా, ఉపేందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు గోపాల్, ఎస్ ప్రకాష్ ,జయలక్ష్మి,శంకర్, భుజంగ రెడ్డి, రాధమ్మ, చంద్రమోహన్, లలిత ,బాలయ్య ,చందు, లింగన్న, వెంకన్న, సావిత్రి, షాహిన్ బేగం, రాజశేఖర్ గౌడ్, జంగయ్య, నారాయణ లతో పాటు వివిధ జిల్లాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Aug 29 2023, 21:19