Mamata: 'డిసెంబర్'లోనే లోక్‌సభ ఎన్నికలు ఉండొచ్చు!
కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికలపై (General Elections) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) ఈ ఏడాది డిసెంబర్‌లో వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు.
ఇప్పటికే ప్రచారం కోసం అన్ని హెలికాప్టర్లను కాషాయ పార్టీ ముందస్తుగా బుక్ చేసుకొందన్నారు. టీఎంసీ యువజన విభాగం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆమె.. మూడోసారి భాజపా అధికారంలోకి వస్తే 'నిరకుంశ పాలనే'నని ఆరోపించారు..
'మూడోసారి భాజపా అధికారంలోకి వస్తే ఇక నిరంకుశ పాలనే. ఈ ఏడాది డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలకు భాజపా వెళ్లవచ్చని అంచనా వేస్తున్నా. ప్రచారం కోసం అవసరమైన అన్ని హెలికాప్టర్లను కాషాయ పార్టీ ఇప్పటికే ముందస్తుగా బుక్ చేసుకొంది. మరో పార్టీకి అవకాశం ఇవ్వొద్దనేది వారి ఆలోచన. పశ్చమ బెంగాల్‌లో సీపీఎం పాలనకు ముగింపు పలికాం. లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను తప్పకుండా ఓడిస్తాం. ఇప్పటికే అన్ని వర్గాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం భాజపా చేస్తోంది. మరోసారి అధికారం చేపడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి' అని మమతా బెనర్జీ పేర్కొన్నారు..
ఇక అక్కడి గవర్నర్ తీరుపై మండిపడ్డ ఆమె.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంతో సవాలుకు దిగవద్దని సూచించారు.. గవర్నర్ పదవి అంటే తనకు గౌరవం ఉన్నప్పటికీ.. ఆయన తీరు మాత్రం బాగాలేదన్నారు. ఇక ఇటీవల జాదవ్‌పుర్ యూనివర్సిటీలో చోటుచేసుకున్న వివాదంపైనా స్పందించిన మమతా.. 'గోలీ మారో' అంటూ నినాదాలు చేసిన వారిని అరెస్టు చేస్తామన్నారు..
Aug 28 2023, 18:52