రెండవ ఏఎన్ఎం ల ధర్నా లో భాగంగా.. టెంట్ కింద వరలక్ష్మి వ్రతం
నల్లగొండ: మహిళలకు ప్రీతి పాత్రమైన వరలక్ష్మి వ్రతం కూడా రోడ్ మీద ఆందోళనతో 2వ ఏఎన్ఎం లు పూజలు చేసుకోవాల్సిన పరిస్తితి రావటం విచారకరమని ఏఐటియూసి ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న రెండోవ ఏఎన్ఎం ల నిరవధిక సమ్మె పదవ రోజు శుక్రవారం శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టెంట్ కింద నే వరలక్ష్మి వ్రతం చేశారు.
ఈ సందర్బంగా దేవేందర్ రెడ్డి మాట్లాడతూ.. గత16 నుండి 20 ఏళ్లుగా రెండవ ఏఎన్ఎంలు నిర్విరామమంగా ఆరోగ్యవంతమైన సమాజం తయారు చేయడం కోసం పనిచేస్తున్న ఏఎన్ఎం లు తమని పర్మినెంట్ చేయాలని పండుగ రోజు కూడా ఇంటి వద్ద ఉండకుండా ఆందోళన చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రము లోని 5 వేలకు పైగా ఉన్న మహిళ లు పది రోజులుగా ఆందోళన చేస్తున్నా, పట్టించుకోక పోవటం విచారకరమని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా.. రెగ్యులర్ ఏఎన్ఎం, మొదటి ఏఎన్ఎం మరియు 2వ ఏఎన్ఎం లు ఒకే రకమైన పని చేసినప్పుడు వేతనాలలో తేడాలు ఎందుకు ఇస్తున్నారని దేవేందర్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణా వస్తె కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని చెప్పిన ప్రభుత్వం 16 సంవత్సరాలుగా పని చేస్తున్న వారినీ పర్మినెంట్ చేయకపోవడం అన్యాయమని అన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఏఎన్ఎం లందరిని బే షరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వంటి కష్టకాలంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని తమ ప్రాణాలను ప్రాణంగా పెట్టి ప్రజలకు సేవలందించారన్నారు. నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలన్నారు. ఏఎన్ఎం ల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి సరికాదన్నారు. ఆరోగ్య వంతమైన సమాజాన్ని తయారు చేస్తున్న ఏఎన్ఎంలను పట్టించుకోక పోవటం అన్యాయం అన్నారు. ప్రభుత్వం టాబ్ లు ఇచ్చిన నెట్ బాలెన్స ఇవ్వటం లేదు అన్నారు. ఆరు నుండి పది వేల మంది జనాభాకు ఒక్కఏఎన్ఎం పనిచేస్తుందని, ఎక్కడికి వెళ్ళినా టిఎ, డిఎ లు ఇవ్వటం లేదని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి, రెండవ ఏఎన్ఎంల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రత్నకుమారి, జిల్లా కార్యదర్శి నర్సమ్మ, విజయలక్ష్మి, ప్రమీల, అలివేలు, హైమవతి, ధనలక్ష్మి, గీతా రాణి, అనిత, మంజుల, సునిత, వెంకటమ్మ, కళావతి, కాంతమ్మ, సుశీల, సత్యమ్మ, జయంతి, వినోద, ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి వి, లెనిన్, తదితరులు పాల్గొన్నారు.
Aug 28 2023, 12:45