పెరుగుతున్న ఏసీ హెల్మెట్ల వినియోగం
•ట్రాఫిక్ సిబ్బందికి తప్పుతున్న ఇబ్బందులు
•బయటి వాతావరణాన్ని బట్టి లోపల ఉష్ణోగ్రతలు మార్చుకునే వీలు
మండే ఎండల్లో.. అధిక ఉష్ణోగ్రతల మధ్య విధులు నిర్వహించే ఉద్యోగులు, వీధి వ్యాపారులు, ద్విచక్ర వాహన దారుల కోసం ఎయిర్ కండిషనర్ (ఏసీ) హెల్మెట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంత ఎండలోనైనా వీటిని పెట్టుకొని చల్లగా విధులు నిర్వహించుకోవచ్చు. బైక్‌పై ప్రయాణాలు చేయవచ్చు. తీవ్రమైన చలి వాతావరణం ఉన్నప్పుడు.. ఈ ఏసీ హెల్మెట్లను హీటర్లుగానూ వాడుకోవచ్చు. వీటి ప్రయోజనాలను గుర్తించిన రాష్ట్ర పోలీసు శాఖ.. రాచకొండ కమిషనరేట్‌లో కొందరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు ప్రయోగాత్మకంగా అందించింది. చాలా ఉపయోగకరంగా ఉన్నాయని సిబ్బంది చెప్పడంతో.. 100 మంది ట్రాఫిక్ పోలీసులకు గతంలో రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ పంపిణీ చేశారు. ముఖ్యంగా ఎండాకాలంలో వీటిని ధరించి.. ట్రాఫిక్ విధుల్లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అహ్మదాబాద్‌లోనూ ఇటీవల ట్రాఫిక్ పోలీసులకు వీటిని ప్రయోగాత్మకంగా అందించారు.
వినియోగదారుల అవసరాల మేరకు తయారీ..
మనవద్ద అంత చలి ఉండదు కాబట్టి.. ఎండ నుంచి ఉపశమనం కల్పించే హెల్మెట్లకే డిమాండ్ ఉంటోంది. హిమాచల్‌ప్రదేశ్ తదితర శీతల ప్రాంతాల్లో కార్మికులతో పాటు సాధారణ ప్రజలు సైతం బయటకు వచ్చేటప్పుడు హీటర్ హెల్మెట్లు ధరిస్తుంటారు. మన దగ్గర మైనింగ్, ఆయిల్ గ్యాస్, సిమెంట్, ఫార్మా, ఉక్కు తదితర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే కంపెనీల్లో కార్మికుల కోసం ఏసీ హెల్మెట్‌లు సరఫరా చేస్తున్నాం. వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా వీటిని తయారు చేస్తున్నాం. నగర ట్రాఫిక్ పోలీసుల కోసం తయారు చేసి ఇచ్చాం’’ అని హైదరాబాద్‌కు చెందిన జార్ష్ కంపెనీ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ శశికాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మరికొన్ని కంపెనీలు సైతం ఏసీ హెల్మెట్లు తయారు చేస్తున్నాయి.
ఎలా పని చేస్తాయంటే.
హెల్మెట్‌పై ఏసీ యూనిట్ ఉంటుంది. దీనినుంచి లోపల భాగంలో ఉన్న చిన్న రంధ్రాల ద్వారా చల్లని గాలి తల, ముఖ భాగానికి వస్తుంది. దీని బరువు 750 గ్రాములు. అందులో ఏసీ యూనిట్ బరువు 300 గ్రాములు ఉంటుంది. దీనిని పూర్తిగా హెడీపీఈ ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారు చేస్తారు.
ఈ హెల్మెట్లు సాలిడ్ స్టేట్ కూలింగ్ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఫ్యాన్, హీట్‌సింక్, కూల్‌సింక్ పరికరాలు వాడతారు. ఇందులోని బ్యాటరీని 3 గంటలు ఛార్జింగ్ చేస్తే.. 8 గంటలు పనిచేస్తుంది.
ముఖ్యంగా బయట ఉష్ణోగ్రతలను బట్టి హెల్మెట్ లోపల 10-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువ, ఎక్కువ చేసుకునే వీలు ఉంటుంది. బయట 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే.. ఏసీ హెల్మెట్‌లో 25 డిగ్రీల వరకు తగ్గించుకొని చల్లని గాలి పొందవచ్చు. ఈ ఏసీ యూనిట్ వాటర్‌ఫ్రూప్‌గా ఉంటుంది. వీటి ధరలు రూ.6 వేల నుంచి వినియోగదారుల అవసరాలను బట్టి రూ.60 వేల వరకు లభ్యమవుతున్నాయి.
ఐఎస్‌ఐ మార్కు తప్పనిసరి.
వాహనదారులు ఏ హెల్మెట్ అయినా వినియోగించుకోవచ్చు. అయితే భారతీయ ప్రమాణాల బ్యూరో నిబంధనల ప్రకారం ఐఎస్‌ఐ మార్కు తప్పనసరిగా ఉండాలి’ అని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పాండురంగ నాయక్ తెలిపారు.
Aug 27 2023, 14:24