Congress: కొడంగల్ నుంచి రేవంత్ ఒక్కరే.. ఇల్లందులో అత్యధికంగా 38 దరఖాస్తులు
హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ టికెట్ల కోసం అధిక సంఖ్యలో ఆశావహులు ముందుకొచ్చారు. సీనియర్ నాయకుల నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అర్జీలు సమర్పించారు..
మొత్తంగా 119 నియోజకవర్గాలకు 1025 దరఖాస్తులు వచ్చాయి. ఆశావహుల్లో పలువురు పారిశ్రామికవేత్తలూ ఉన్నారు. కొందరు నేతలు రెండు, మూడు నియోజకవర్గాల నుంచి పోటీకి ఆసక్తి చూపారు. కొడంగల్ నుంచి పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఒక్కరు మాత్రమే దరఖాస్తు సమర్పించారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి..
రిజర్వుడ్ సెగ్మెంట్‌ల నుంచి అత్యధికంగా..!
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (మధిర), ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు (మంథని), సీతక్క (ములుగు), జగ్గారెడ్డి (సంగారెడ్డి), పొదెం వీరయ్య (భద్రాచలం) ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల నుంచి అదనంగా అర్జీలు వచ్చాయి. రిజర్వుడ్ సెగ్మెంట్‌లకు సైతం అత్యధిక దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా ఇల్లందు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గానికి 38 మంది దరఖాస్తులు వచ్చాయి. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్ నుంచి, ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి పోటీకి దరఖాస్తులు ఇచ్చారు..
హుజురాబాద్ నుంచి బల్మూరి వెంకట్
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్గొండ), ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (జగిత్యాల), పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ గౌడ్(ఎల్బీనగర్), పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్(నిజామాబాద్ అర్బన్), ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ (హుజురాబాద్), మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్, కొండా సురేఖ వరంగల్ ఈస్ట్, మల్‌రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి పోటీకి ముందుకొచ్చారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాలపై ఆసక్తి చూపారు. కొద్దికాలంగా గాంధీభవన్‌కు దూరంగా ఉంటున్న కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు..
Aug 26 2023, 14:32