ఎన్నికల యుద్దం: సేనలు సిద్ధం..సై..!
ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. గెలుపు కోసం ముఖ్యమంత్రి జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రతి ఇంటికి తమ సైన్యం వెళ్లేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు..
వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి తోను ప్రభుత్వానికి సంబంధాలు ఏర్పడ్డాయి. పథకాల లబ్ధిదారులే తమ ఓటు బ్యాంకు గా వైసీపీ భావిస్తుంది. ఇప్పుడు వీరికి పోటీగా టీడీపీ కుటుంబ సారధుల పేరుతో తమ సైన్యాన్ని రంగంలోకి దించుతోంది. దీంతో గడప దగ్గర నుంచే అసలు సిసలు ఎలక్షన్ వార్ ఏపీలో మొదలుకానుంది..
ఏపీలో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలనేది ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. జగన్‌ను ఓడించి అధికారం చేపట్టాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్. ఇందుకోసం చంద్రబాబు జనసేనాని పవన్‌తో పొత్తు దాదాపు ఖాయం చేసుకున్నారు. ఈ ఇద్దరితో బీజేపీ కలిసి వస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో సీఎం జగన్ నమ్ముకున్న సంక్షేమ ఓట్ బ్యాంకుకు కౌంటర్ గా చంద్రబాబు మహానాడు వేదికగా సంక్షేమ మేనిఫెస్టోను ప్రకటించారు. కానీ ఆ మేనిఫెస్టోకు ప్రజల నుంచి ఆశించిన స్పందన కనిపించలేదు. దీంతో ఇప్పుడు వైసీపీ పథకాలను ఇంటింటికి అందిస్తున్న వాలంటీర్లకు పోటీగా కుటుంబ సారధులను రంగంలోకి దించి తన మేనిఫెస్టోను ప్రతి ఇంటికి చేరువ చేయాలనేది చంద్రబాబు తాజా ఆలోచన..
ఇందుకోసం వాలంటీర్ల తరహాలోనే ప్రతి 50 ఇళ్లకు ఒక కుటుంబ సారధిని నియమించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఇప్పటికే పార్టీ ఇన్చార్జిలు వీరి ఎంపికకు సంబంధించి కసరత్తు పూర్తి చేశారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి వీరందరికీ బాధ్యతలు కేటాయించనున్నారు. టీడీపీ ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టోను టీడీపీ సూపర్ సిక్స్ ఇది బాబు గ్యారెంటీ స్కీం పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీరికి శిక్షణ ఇవ్వనున్నారు..
ముఖ్యమంత్రి జగన్ తన పథకాల అమలులో ప్రధానంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి పథకంలోనూ మహిళలను లబ్ధిదారులుగా గుర్తించారు. అమ్మఒడి మొదలు ఇంటి స్థలాల వరకు అన్ని మహిళల పేరు మీదే పంపిణీ చేస్తున్నారు. మహిళా ఓట్ బ్యాంకును సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దీనికి పోటీగా చంద్రబాబు సైతం మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మహాశక్తి పేరుతో కొత్త పథకాలను ప్రకటించారు. 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి మహిళకు ఆర్థికంగా చేయూతనివ్వటంతో పాటుగా , మహిళలకు జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తామని ప్రకటించారు..
ప్రతి ఇంటికి రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ నేతలు ఈ పథకాల పైన అన్ని జిల్లాల్లో ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు ప్రతి ఇంటికి తన మేనిఫెస్టోను వివరించేందుకు కుటుంబ సారధులను ఎంచుకున్న చంద్రబాబు వారి ద్వారా వాలంటీర్ వ్యవస్థకు పోటీగా కొత్త వ్యవస్థను రంగంలోకి దించుతున్నారు. ఎన్నికల్లోగా టీడీపీ సారధులు ప్రతి ఇంటి తోను సంబంధాలు పెంచుకొని వైసీపీ కంటే మెరుగైన సంక్షేమం అందిస్తామని ప్రచారం చేస్తూ టీడీపీకి అనుకూలంగా వారిని మలుచుకునేందుకు ప్రయత్నాలు చేయటమే వీరి నియామకం వెనుక అసలు ఉద్దేశం గా తెలుస్తుంది..
ఇప్పటికే ప్రభుత్వ పథకాలు అందిస్తున్న వాలంటీర్లతో పాటుగా వైసీపీ నేతలు ప్రతి నియోజకవర్గంలో పార్టీ నుంచి కన్వీనర్లు గృహసారధుల నియామకం పూర్తిచేసింది. జగనన్న సురక్ష పేరుతో ప్రతి ఇంటికి ఈ టీం వెళ్లి అర్హత ఉండి పథకాలు అందని వారిని గుర్తించడంతో పాటుగా కావలసిన ధృవపత్రాలను సమకూర్చింది. అర్హత ఉన్నట్లుగా గుర్తించిన లబ్ధిదారులకు పథకాల పంపిణీ ప్రారంభించింది. పూర్తిగా పాజిటివ్ ఓటింగ్‌ను నమ్ముకున్న ముఖ్యమంత్రి జగన్ పథకాల లబ్ధిదారుల సంఖ్య ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈసారి ఎన్నికలు పూర్తిగా సంక్షేమ ఓట్ బ్యాంక్ ఆధారంగానే జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు టీడీపీ కూడా కుటుంబ సారుథుల పేరుతో తమ సైన్యాన్ని రంగంలోకి దించటంతో ఇక క్షేత్రస్థాయిలో వాలంటీర్లు వర్సెస్ టీడీపీ గృహసారథులు అన్నట్లుగా వార్డు స్థాయిలోనే పొలిటికల్ వార్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..
Aug 26 2023, 14:27