డీఎస్సీ ఏర్పాట్లపై అధికారుల కసరత్తు
తెలంగాణలో డీఎస్సీకి లైన్ క్లియర్ అయ్యింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన నేపథ్యంలో పాఠశాల విద్యలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ శుక్రవారం సాయంత్రం ఆమోదం తెలిపింది.
ఈ మేరకు జీవో – 96ను జారీచేసింది. ఈ నేపథ్యంలోనే డీఎస్సీ మార్గదర్శకాల రూపకల్పనపై సంబంధిత శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.అధికారిక సమాచారం ప్రకారం దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తారు.
పరీక్షలను ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. గురుకుల ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించగా, డీఎస్సీని సైతం ఇదే తరహాలో నిర్వహించే అంశంపై విద్యాశాఖ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.
పరీక్షలను మూడు రోజులపాటు నిర్వహిస్తారు ఎస్జీటీలకు ఒక రోజు, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. తాజాగా 5,089 పోస్టుల భర్తీకి జీవో విడుదల కాగా, 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఫర్ డిసేబుల్డ్ పోస్టులను కొత్తగా మంజూరుచేయాల్సి ఉన్నది.
ఇవి కొత్త పోస్టులు కావడంతో ఆయా పోస్టులను మంజూరుచేస్తూ.. భర్తీకి అనుమతినిస్తూ ఒకే జీవోను జారీచేసే అవకాశాలు ఉన్నాయి. ఈ జీవో ఒకట్రెండు రోజుల్లో వస్తుందని అధికారులు చెప్తున్నారు.
టీచర్ ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ ఎగ్జామ్‌ను 80 మార్కులకు నిర్వహిస్తారు. అ ప్రశ్నపత్రంలో మాత్రం 160 ప్రశ్నలుంటాయి. అంటే ఒక్కో ప్రశ్నకు అరమార్కు చొప్పున కేటాయిస్తారు.
ఇక టెట్‌కు 20 మార్కుల వెయిటేజీ ఉంటుంది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష నిర్వహణ రాష్ట్రస్థాయిలోనే ఉంటుంది. అయితే, ఫలితాలు ప్రకటించిన తర్వాత జిల్లాలవారీగా మెరిట్, సెలెక్షన్ జాబితాలు విడుదల చేస్తారు.
కలెక్టర్ల నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ, డీఎస్సీ, ఈ పోస్టుల భర్తీని చేపడుతుంది. కాగా, పాఠశాల విద్యాశాఖ అధికారులు డీఎస్సీ ఏర్పాట్లపై కసరత్తు ముమ్మరం చేశారు.
మార్గదర్శకాలు
గతంలో ఏజెన్సీ పోస్టుల్లో 100 శాతం గిరిజనులకే కేటాయించగా,
ఈ నిబంధనను తాజాగా ఎత్తివేస్తున్నారు. రోస్టర్ ప్రకారం అంతా పోటీపడొచ్చు.
గతంలో 6 శాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్ తాజాగా 10 శాతానికి పెంచుతున్నారు.
గతంలో లోకల్, ఓపెన్ కోటా రిజర్వేషన్ 80 : 20 పద్ధతిలో ఉండగా, తాజాగా 95 : 5 రేషియోలో అమలుచేస్తారు.
అభ్యర్థుల స్థానికతను నిర్ధారించేందుకు గతంలో
4-10 తరగతుల చదువును పరిగణలోకి తీసుకోగా,
తాజాగా 1-7 తరగతులను లెక్కలోకి తీసుకొంటారు.
Aug 26 2023, 11:13