Chandrayaan-3: చంద్రయాన్-3 ల్యాండింగ్‌తో.. '45 ట్రిలియన్' ట్రెండింగ్..!
జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతంగా అడుగుపెట్టడం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అసాధ్యమనుకున్న ఈ యాత్రను సుసాధ్యం చేసిన భారత్ (India), ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలపై అన్ని దేశాలూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి..
అయితే, చంద్రయాన్-3 (Chandrayaan-3) ల్యాండింగ్ నేపథ్యంలో ఇప్పుడు '45 ట్రిలియన్ (45 Trillion)' అనే పదం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మన చారిత్రక ప్రయోగంపై బ్రిటిష్ (British) జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యలే ఇందుక్కారణం. ఇంతకీ ఏం జరిగిందంటే..
చంద్రయాన్-3 ప్రయోగంపై ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకలు వెల్లువెత్తుతున్న వేళ.. కొందరు బ్రిటన్ (Britain) జర్నలిస్టులు భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ''జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి రాకెట్లను పంపించేలా అంతరిక్ష రంగంలో పురోగతి సాధించిన దేశాలకు యూకే (UK) ఆర్థిక సాయం పంపించాల్సిన అవసరం లేదు'' అని యూకేకు చెందిన సోఫీ అనే జర్నలిస్టు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. జీబీ న్యూస్‌కు చెందిన మరో మీడియా ప్రజెంటేటర్ స్పందిస్తూ.. ''రూల్ ప్రకారం.. జాబిల్లికి అవతలివైపు రాకెట్లను ప్రయోగించే మీరు.. విదేశీ సాయం కోసం మా వద్దకు రావొద్దు. అంతేగాక, మేమిచ్చిన 2.3 బిలియన్ పౌండ్లను మాకు తిరిగిచ్చేయాలి'' అని అన్నారు..
దీంతో వీరి పోస్టులపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు శతాబ్దాల పాటు భారత్‌ను పాలించిన యూకే.. తమ నుంచి దోచుకున్న మొత్తం 45 ట్రిలియన్ డాలర్లను తిరిగిచ్చేయాలంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు '45 ట్రిలియన్' అనే పదం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ 45 ట్రిలియన్ ఎలా తెలిసిందంటే..?
భారత్‌కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ ఇటీవల కొలంబియా యూనివర్శిటీ ప్రెస్‌లో ఓ అధ్యయనాన్ని ప్రచురించారు. 1765 నుంచి 1938 వరకు బ్రిటన్.. భారత్ నుంచి 45 ట్రిలియన్ డాలర్లు సంపాదించిందని పట్నాయక్ పేర్కొన్నారు. రెండు శతాబ్దాల కాలంలో పన్నులు, వాణిజ్యంపై ఉన్న డేటాను అధ్యయనం చేసి ఆమె ఈ లెక్క చెప్పారు. ఈ మొత్తం.. ప్రస్తుతం యూకే జీడీపీ కంటే 15 రెట్లు ఎక్కువ..
ఇదిలా ఉండగా.. అంతరిక్ష ప్రయోగాలకు యూకే నుంచి ఆర్థిక సాయాన్ని భారత్ 2015లోనే నిలిపివేసిందని ఈ ఏడాది మార్చిలో గార్డియన్ ఓ కథనం వెలువరించింది. అయితే, ఆ తర్వాత ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ఎయిడ్ ఇంపాక్ట్ సమీక్ష చేపట్టి.. 2016 నుంచి 2021 వరకు యూకే.. భారత్‌కు 2.3 బిలియన్ పౌండ్లు సాయంగా ఇచ్చిందని ప్రకటించింది. దీన్ని ఉద్దేశిస్తూనే యూకే జర్నలిస్టులు పోస్టులు చేశారు..
Aug 25 2023, 10:51