Nara Lokesh: సైకో పాలనలో కంపెనీలు తరలిపోతున్నాయ్: లోకేశ్
గన్నవరం: తెదేపా హయాంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేశామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పరిధిలోని మల్లవల్లిలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు 100 ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు..
జగన్ వచ్చిన తర్వాత ఆ భూముల్లో వైకాపా నేతలు మట్టి తవ్వుకుంటున్నారు తప్ప.. ఇళ్లు కట్టలేదని విమర్శించారు. మల్లవల్లి గ్రామస్థులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. తెదేపా సైకిల్ గుర్తులో ముందు చక్రం సంక్షేమానికి, వెనుక చక్రం అభివృద్ధికి నిదర్శనమన్నారు. రూ.200 పెన్షన్‌ని రూ. 2000కి పెంచిన ఘనత తెదేపాకే చెల్లుతుందన్నారు..
''పెళ్లి కానుక, పసుపు కుంకుమ, చంద్రన్న బీమా లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తెదేపా అమలు చేసింది. మల్లవల్లిలో 1400 ఎకరాల భూములను కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది నాయకులు కొట్టేయాలని ప్రయత్నిస్తే తెదేపా పోరాడింది. మల్లవల్లిలో భూములు కాపాడి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేసింది కూడా తెదేపానే. విధ్వంసంతో జగన్ పరిపాలన మొదలు పెట్టారు. ప్రజావేదికనును కూల్చి వేసి పాలన మొదలు పెట్టారు. మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో 75 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేవలం సైకో పాలన వలన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. అశోక్ లేలాండ్ లాంటి అనేక కంపెనీలను తెదేపా తీసుకొస్తే.. జగన్ వాటిని తరిమేస్తున్నారు.'' అని లోకేశ్ విమర్శించారు..
తెదేపా హయాంలో పసుపుకుంకుమ కింద రూ.20 వేలు ఇచ్చేవారని, ఈ ప్రభుత్వంలో మాకు సాయం అందలేదని మల్లవల్లి మహిళలు లోకేశ్ ఎదుట మొరపెట్టుకున్నారు.'' పండగ కానుకలు కూడా జగన్ ప్రభుత్వం ఆపేసింది. ఇళ్లు నిర్మించుకున్న వారికి జగన్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. గ్రామంలో కొన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు లేదు. జగన్ ప్రభుత్వం మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌ని నాశనం చేసింది. మాకు ఉద్యోగాలు లేకుండా చేశారు. ఉన్న కంపెనీలు అన్ని ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. 2వేల మందికి ఉద్యోగాలు కల్పించిన అశోక్ లేలాండ్ కంపెనీ జగన్ పాలనలో వెళ్లిపోయింది. గ్రామంలో వైఎస్‌ఆర్ జలకళ కింద బోర్లు వేయిస్తామని లంచం తీసుకొని బోర్లు వెయ్యకుండా మోసం చేశారు.'' అని మల్లవల్లి గ్రామస్థులు లోకేశ్ ఎదుట వాపోయారు..
Aug 24 2023, 20:08