బిఆర్ఎస్ టికెట్ల కేటాయింపులో బీసీలకు తీరని అన్యాయం
కళ్లకు నల్ల గంతలు కట్టుకొని నిరసన ప్రదర్శన వ్యక్తం చేసిన బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్
ఇటీవల బిఆర్ఎస్ భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఈ అసెంబ్లీ ఎన్నికలలో పోటి చేసే తమ అభ్యర్థుల జాబితా ప్రకటించారని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో 60 శాతం ఉన్న బీసీలకు కేవలం 20 శాతం టికెట్లు ఐదు శాతం ఉన్న రెడ్లకు 33% అరశాతం ఉన్న వెలమలకు 16% టికెట్లు కేటాయించి మరొకసారి బిఆర్ఎస్ పార్టీ బీసీ ద్రోహుల పార్టీగా నిరూపించుకుందని ఇందుకు నిరసనగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కళ్లకు నల్ల గంతలు కట్టుకొని నిరసన ప్రదర్శన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ బీసీలకు గతంలో కంటే తక్కువగా 23 టికెట్లు కేటాయించి బీసీలను అవమానించిందని బిఆర్ఎస్ పార్టీకి కెసిఆర్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనడానికి బీసీలకు కేటాయించినటువంటి టికెట్ల కేటాయింపే నిదర్శనం అని ఆయన అన్నారు, బీసీలను పచ్చి మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీకి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు, రెడ్లకు, వెలమలకు టికెట్ల కేటాయింపుల్లో పెద్దపీట వేసిన బిఆర్ఎస్ పార్టీ అంటే రెడ్ల వెలమల సమితిగా మారిందని ఆయన ఆరోపించారు,
సిట్టింగ్ సీట్లు ఇచ్చి తెలంగాణలో అగ్రకులాల పాలనను కేసీఆర్ శాశ్వతం చేయాలని చూస్తున్నారని అందులో భాగంగానే 115 మందిలో 65 మంది అగ్రకులాలకు టికెట్లు ఇవ్వడం చాలా సిగ్గుచేటన్నారు. బీసీలలో ప్రతి నియోజకవర్గంలో అత్యంత సమర్థులైన వారు ఉన్నప్పటికీ పార్టీ పట్ల విధేయులుగా ఉండి పార్టీ కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను పణంగా పెట్టిన వాళ్ళు ఉన్నప్పటికీ కేవలం బీసీలనే కారణంతో కేసీఆర్ వారిని పక్కన పెట్టి అగ్రకులాలకు అరశాతం ఐదు శాతం ఉన్నోళ్లకు టికెట్ లు ఇవ్వడం న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. బీసీలకు టికెట్లు ఇవ్వని బిఆర్ఎస్ పార్టీకి బిసీల నుండే పతనం మొదలవుతుందన్నారు. బీసీలు అంటే లెక్కలేకుండా వ్యవహరించిన బిఆర్ఎస్ పార్టీకి కెసిఆర్ కు బీసీల తడాఖా ఎట్లా ఉంటదో ఈ ఎన్నికలలో చూపిస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, యలిజాల రమేష్, కర్నె శ్రీకాంత్ లింగాయత్, అనిల్ చెర్రీ తదితరులు పాల్గొన్నారు.
Aug 24 2023, 15:54