టీడీపీ ఎంపీ పేరిట సోషల్ మీడియాలో రచ్చ
•కావాలనే నాపై దుష్ప్రచారం
•ట్విటర్ వేదికగా స్పందించిన గల్లా జయదేవ్
'యువగళం పాదయాత్రపై నమ్మకం లేకనే పాదయాత్రకు వెళ్లలేదు.. ఈ పాదయాత్ర వల్ల ఒరిగింది ఏమీ లేదు. అర్ధరాత్రి దాటాక పాదయాత్ర ఏంటి..? పార్టీలో కొందరు మతి పోయినట్లుగా ప్రవర్తి స్తున్నారు.. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమే' అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే.
అంతేకాదు 'ముందుగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తేనే ఇప్పటి నుంచి పనిచేసుకునే అవకాశం ఉంటుంది.
లోకేశ్ ను ఏపీ ప్రజలు నమ్మడం లేదు. ఎన్ని కిలోమీటర్లు నడిచినా ప్రయోజనం శూన్యం. అందుకే యువగళం పాదయాత్రకు వెళ్లలేదు. టీడీపీ హైకమాండ్ ఇకనైనా పునరాలోచన చేయాలి' అంటూ గల్లా జయదేవ్ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరిగింది.
అయితే ఈ ప్రచారం టీడీపీలో సైతం చర్చనీయాంశంగా మారింది.
అందులోనూ లోకేశ్ పాదయాత్రలో గల్లా జయదేవ్ కనిపించకపోవడంతో ఒకవేళ నిజంగానే చేసి ఉంటారే మొనన్న అనుమానం కూడా కలిగింది.
అయితే ఈ ప్రచారంపై గల్లా జయదేవ్ ట్విటర్ వేదికగా స్పందించారు.
నారా లోకేశ్, యువగళం పాదయాత్రపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించారు. 'టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీద, ఆయన తలపైట్టిన పాదయాత్ర మీద నేను కొన్ని వ్యాఖ్యలు చేశానని వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇవి కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రచారం తప్ప ఏమాత్రం నిజం లేదు.
నేను ఈ వాఖ్యలు చేసినట్టు రుజువు లేకుండా, నా ఫోటో వాడి ఇలా అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు.
నేను ఈ వార్తలని, వీరు అవలంబించిన పద్ధతులని తీవ్రంగా ఖండిస్తున్నాను' అని తెలిపారు.
అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని గల్లా జయదేవ్ తేల్చి చెప్పారు.
Aug 24 2023, 15:18