NLG: పిడిఎస్యూ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి అగమ్య గోచారంగా మారిందని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవడంలేదని, విద్యార్థుల సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని పిడిఎస్యూ జిల్లా ఇన్చార్జి ఇందూరు సాగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే పవన్ లు అన్నారు.
మంగళవారం నల్లగొండ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద PDSU ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు 16 లక్షల మంది పైగా ప్రభుత్వం చెల్లించే ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ లపై ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు.
గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను అందించకపోవడంతో అనేకమంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అనేక కొత్త హామీలనిస్తూ ప్రజలను మభ్యపెడుతుందని, విద్యార్థులను పట్టించుకోవడంలేదని, విద్యార్థి సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని ఏద్దేవా చేశారు.
విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించకపోగా ప్రభుత్వమే వారిని సంక్షోభంలోకి నేడుతున్నదని తెలిపారు. జిల్లాలో 12 ప్రభుత్వ పాఠశాలకు పైగా విద్యార్థులు లేరన్న సాకుతో మూసివేతకు సిద్ధంగా ఉంచారని, విద్యాసంస్థలలో కనీస, మౌలిక వసతులు కల్పించకుండా ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు భర్తీ చేయకుండా విద్యాసంస్థలను మూసివేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచలేదని నెలల తరబడి కాస్మొటిక్ చార్జీలు చెల్లించడం లేదని అన్నారు. గురుకులాలలో విద్యార్థులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని సమస్యల వలయంలో సంక్షేమ హాస్టల్, గురుకుల విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించి విద్యారంగాన్ని మెరుగుపరచాలని రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ,అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని 5,500 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి చారి, పిడిఎస్ యూ నాయకులు బి. రాఘవ్, ఎన్. ప్రశాంత్, టి. సుధాకర్, ప్రభు, శివశంకర్, రాజు, ఈశ్వర్, ప్రవీణ్, మధు, సురేష్, శేఖర్, మాధవ్, తదితరులు పాల్గొన్నారు
Aug 23 2023, 11:43