తొలకరి పలకరింపేదీ?
‘నైరుతి’ కోసం రైతుల ఎదురుచూపు
వర్షాల ఆలస్యంతో ముందస్తు సాగుకు గ్రహణం
వానాకాలం సీజన్‌కు ఆదిలోనే హంసపాదు
ఏరువాక పౌర్ణమి వచ్చింది వెళ్లింది.. మృగశిర కార్తెలో సగం గడిచిపోయింది. ఇప్పటికీ నైరుతి రుతుపవనాల పలకరింపు లేదు. తొలకరి పలకరింపు కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఫలితంగా ఆదిలోనే హంసపాదు అన్నచందంగా వానాకాలం సాగుకు గ్రహణం పడుతోంది. కాలం దాటుతున్నా నైరుతి రుతుపవనాల జాడ లేకపోవడం.. ఆశించిన మేర వర్షాలు పడే అవకాశం లేదని రైతుల ఆందోళన చెందుతున్నారు. జూన నెల సగం అయిపోయినా ఎండలు మండుతుండటం.. వేడి గాలులు వీస్తుండటం అన్నదాతలను మరింత ఆవేదనకు గురిచేస్తున్నాయి. 2015 నాటి కరువు పరిస్థితులు పునరావృతమవుతాయని చాలామంది అభిప్రాయపడుతున్నాయి.
పొడిదుక్కుల్లోనే విత్తనాలు..
రోహిణి కార్తెలో విత్తనం నాటితే ఈ సమయంలో మొక్క మొలుస్తుందని, ఆ మొక్కలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి చీడ పీడలను తట్టుకోవడంతో పాటు పంట దిగుబడులు కూడా గణనీయంగా వస్తాయని రైతులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో రోహిణి కార్తె ప్రారంభం కాగానే జిల్లాలో చాలా ప్రాంతాల్లో రైతుల పొడి దుక్కుల్లోనే పత్తి విత్తనాలు వేశారు. ఎప్పటి లాగే వర్షాలు పడితే మొలకలు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ రుతుపవనాల రాక ఆలస్యమై వానలు రాక.. ఆవిత్తనాలు మట్టిలోనే పొట్లిపోతుండటంతో రైతులు అందోళన చెందుతున్నారు. బోర్లు, బావుల నీటి ఆధారం ఉన్న రైతులు విత్తనం నాటిన రెండు మూడు రోజుల వ్యవధిలోనే తడులు మళ్లించే ప్రయత్నం చేస్తున్నా.. ప్రస్తుతం ఎండ తీవ్రతకు ఆ ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు. అక్కడక్కడ రైతులు భయంతోనే వరినారు కూడా పోస్తున్నారు. మొన్నటి వరకు అకాల వర్షాలు, వడగళ్ల వానలతో చేతికందిన దశలో పంటలు నష్టపోయిన రైతులు.. ఈ వానాకాలం సీజన్ ప్రారంభంలోనే గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పంటలు చేతొకొచ్చే దశలో ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే వానాకాలం పంట సాగును నెల రోజుల ముందుకు తీసుకొచ్చి.. జూన మూడో వారం కల్లా వరినాట్లు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే జరిగితే మార్చి నెలాఖరుకు వరి కోతలు వచ్చి అకాల వర్షాలు, రాళ్ల వానల నుంచి కాపాడుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా పంట కాలాన్ని ముందుకు తేవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే రుతుపవనాలు కాపాడకపోవడంతో వానాకాలం పంటల సాగు మరింత వెనక్కు వెళ్లే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.
ముందస్తు సాగు కష్టమే..
వ్యవసాయ శాఖ నాలుగేళ్ల నివేదికల ప్రకారం వానాకాలం, యాసంగి సీజన్ల జాప్యం కారణంగా అన్నదాతలు వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, రైతులు పంటలు నష్టపోతున్నారని, ఆ పరిస్థితిని అధిగమించాలంటే ఈ వానాకాలాన్ని ముందస్తుగానే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభ్తుత్వం రైతులకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో సహకార సంఘాల ద్వారా భూసారానికి అవసరమైన జీలుగులు, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చే శారు. ఈ నేపథ్యంలో చాలామంది రైతులు ముందుగానే పచ్చిరొట్ల విత్తనాలు చల్లారు. ఉదాహరణకు కల్లూరు డివిజన పరిధిలోని కల్లూరు, సత్తుపల్లి, వేంసూరు,పెనుబల్లి, తల్లాడ, మండలాల్లోని పలు గ్రామాల రైతులు పచ్చి రొట్ట విత్తనాలు చల్లడమే కాకుండా.. వెదజల్లే పద్ధతిలో వరి నార్లు కూడా పోశారు. ఇలా 1.20 లక్షల ఎకరాల్లో వరి, 80వేల నుంచి లక్ష ఎకరాల్లో ఆరుతడి పంటల సాగుకు అవకాశం ఉంది. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ వానాకాలం సీజన్ ఇప్పట్లో ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. పొడి దుక్కలకు అవసమైన కనీసం 8మీమీ వర్షపాతం కూడా నమోదు కాలేదు. వాస్తవానికి రుతుపవనాల ప్రభావంతో పడే వర్షాలతో పంటలు పండే పరిస్థితి నుంచి తుఫాన్ ప్రభావంతో పడుతున్న వర్షాలతోనే పంటలు సాగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఐదేళ్లుగా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తరచూ అల్పపీడన ద్రోణులు ఏర్పడి మాత్రమే భారీ వర్షాలు పడుతున్నాయి.
6.16లక్షల ఎకరాల్లో సాగు అంచనా
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వానాకాలం పంటల సాగు విస్తీర్ణం గతేడాది కంటే 66వేల ఎకరాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. గత వానాకాలంలో 5.50లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా ఈ వానాకాలంలో 6.16లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే పరిస్థితి ఉందని చెబుతున్నారు. దానిలో అత్యధికంగా వరి, పత్తి సాగుకు అన్నదాతలు మొగ్గు చూపుతుండగా తర్వాత స్థానాల్లో మిర్చి, ఆయిల్ పాం పంటలున్నాయి. వానాకాలం పంటలకు సంబంధించి అవసరమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన పంట వరి 2,90,000 ఎకరాలు, మొక్కజొన్న 5,500 ఎకరాలు, పెసర 21వేల ఎకరాలు, పత్తి 2.15లక్షల ఎకరాలు, మిరప 80వేల ఎకరాలలో సాగు కావచ్చని అధికారులు అంచన వేశారు. అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల వివరాలను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.. కేపీ
Jun 17 2023, 18:15