కారు లీడర్ల కొట్లాట
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో సిటింగ్‌లకు, ఆశావహుల మధ్య కొట్లాటలు చోటుచేసుకుంటున్నాయి. పలుచోట్ల ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సిటింగ్ ఎమ్మెల్యేలు, వారి ప్రత్యర్థి వర్గాలు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేసుకుంటూ వ్యక్తిగత పరువుతో పాటు.. పార్టీ పరువును కూడా తీస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో నేతలు పరస్పరం పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుకున్న ఉదంతాలున్నాయి. అధిక శాతం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఇవే బీఆర్‌ఎస్ పార్టీ పుట్టి ముంచుతాయేమోనని క్షేత్రస్థాయి నాయకులు భయపడుతున్నారు.
పార్టీ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్, కవిత, జోగినపల్లి సంతోష్ అండదండలు ఉన్నాయని, టికెట్ హామీ లభించిందని ప్రచారం చేసుకుంటూ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కొందరు నేతలు సొంతంగా కార్యకలాపాలు చేపడుతున్నట్లు తెలిసింది. ఎన్నికల వేళ ఈ బాపతు నేతలు తలనొప్పిగా మారారని సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు అభిప్రాయపడ్డారు.
నేతల మధ్య విభేదాలు క్షేత్రస్థాయి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరికి వారు ముఠా కట్టి సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటుండంతో... ఎవరిదగ్గరికి వెళ్తే ఏమవుతుందో అన్న భయంతో కొందరు మొత్తం పార్టీ కార్యకలాపాలకే దూరంగా ఉంటున్నారు. దాంతో మెజారిటీ కార్యకర్తల్లో స్తబ్ధత నెలకొంది. నేతల గ్రూపు తగాదాలు ఎన్నికల నాటికి తారస్థాయికి చేరతాయని అంచనా వేస్తున్నారు. అధిష్ఠానం జోక్యం చేసుకోకుంటే ఎన్నికల నాటికి పార్టీలో ఇదే అతిపెద్ద సమస్యగా మారుతుందని అనుమానిస్తున్నారు.
ఉమ్మడి మెదక్, ఖమ్మం జిల్లాల్లో
కేసీఆర్ సొంత గడ్డ ఉమ్మడి మెదక్ జిల్లాల్లో మెజారిటీ నియోజకవర్గాల్లో కుమ్ములాటలున్నాయి. పటాన్‌చెరు సిట్టింగ్ ఎమ్మెల్యే జి.మహిపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా చిట్కుల్ సర్పంచినీలం మధు కార్యక్రమాలు చేస్తున్నారు. తనకే టికెట్ వస్తుందని, పెద్దల ఆశీస్సులున్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జహీరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే కే.మాణిక్‌రావును అక్కడి నాయకులు కొందరు వ్యతిరేకిస్తున్నారు. టీఎ్‌సఎంఎ్‌సఐడీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ టికెట్ ఆశిస్తూ నియోజకవర్గంలోకి వస్తున్నారని, దాంతో గ్రూప్ రాజకీయాలు వేడెక్కుతున్నాయని మాణిక్‌రావు వర్గం ఆరోపిస్తోంది. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డిని వ్యతిరేకించే వాళ్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు డాక్టర్ రోహిత్‌ను రంగంలోకి దించారు. రోహిత్ నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.
అటు పద్మ, ఇటు రోహిత్ వర్గాలు సోషల్ మీడియా వేదికగా పార్టీ పరువు తీసే స్థాయిలో పరస్పరం పోస్టులు పెట్టడమే కాకుండా దీనిపై పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కూడా మెదక్ నుంచే టికెట్ ఆశిస్తున్నారు. తన వర్గాన్ని సిద్ధం చేసుకున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతాలక్ష్మారెడ్డిల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. వయోభారంతో బాధ పడుతున్న మదన్‌రెడ్డిని తప్పించే ఆలోచనలో బీఆర్‌ఎస్ నాయకత్వం ఉందని ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లా పాలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్‌ఎస్ టికెట్ కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. తుమ్మల గ్యాప్ లేకుండా క్యాడర్‌ను కలిసేందుకు రోజూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. కొత్తగూడెంలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సీటు తనదేనని ధీమాగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రంగంలోకి దిగారు. మరోవైపు ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాస్ మాత్రం సీఎం ఆశీస్సులు తనకే ఉన్నాయని చెబుతూ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. సీఎం ఆదేశిస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తానంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.
Jun 17 2023, 11:03