నెత్తురు పారుతున్న రోడ్లు : మూడు వేరు వేరు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం
రాష్ట్రంలో రోడ్లు నెత్తురోడాయి! వాహనదారుల నిర్లక్ష్యం.. మితిమీరిన వేగానికి నిండు ప్రాణాలు బలయ్యాయి! వారి ఇళ్లలో అంతులేని విషాదం నెలకొంది! శుక్రవారం మూడు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో తోబుట్టువులైన ఇద్దరు చిన్నారులున్నారు. వారి తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉంది.
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ద్విచక్రవాహనాన్ని వరంగల్-2 డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది! ఆ బైక్‌పై ప్రయాణిస్తున్న కొత్తూరు మొట్లగూడెం గ్రామపంచాయతీ పరిధి శ్రీరాంనగర్ గొత్తికోయగూడానికి చెందిన మాడివి సురేశ్, కుమారి దంపతులు, వారి ఇద్దరు కుమారులు శివ (11), నవీన్ (5) కిందపడ్డారు. శివ, నవీన్‌పై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన సురేశ్, కుమారిని తొలుత ఏటూరునాగారంలోని ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఇద్దరి పరిస్థితీ విషమంగానే ఉంది.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్‌పూర్ శివారులో 16 మంది ప్రయాణికులతో పరిగి వైపు వెళుతున్న ఓ ఆటోను కొడంగల్ వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న అందరూ గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా పీర్లగుట్ట తండాకు చెందిన హేమిబాయి (58), కొత్తపల్లికి చెందిన బోయిని అంజిలమ్మ (48), గుండాలకు చెందిన దార శశికళ (45) మృతిచెందారు. శశికళ ఇద్దరు పిల్లలు కావ్యశ్రీ, కార్తీక్‌లకు గాయాలయ్యాయి. పిల్లలను పరిగి ప్రభుత్వ హాస్టల్‌లో చేర్పించేందుకు, వారిని వెంటబెట్టుకొని శశికళ బయలుదేరగా ఈ ప్రమాదం జరిగింది. మిగతా ప్రయాణికుల్లో తీవ్ర గాయాలైన చంద్రమ్మ, పోచమ్మలను హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు.
ఇక కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో డ్రైవర్ సురేశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం రాయిచెడి గ్రామంలో ఓ ఇంటి వద్ద చెట్టు కింద కూర్చుని సేదతీరుతున్న నలుగురు మహిళలపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి యజమాని, ఆశా కార్యకర్త అమృతమ్మ (37) అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడ్డ మహిళలు అనిత, హేస్సేనమ్మలను అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనిత మృతిచెందింది. హుస్సేనమ్మను మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు......,...
Jun 17 2023, 10:49