Cyclone Biparjoy: ముంచుకొస్తున్న బిపోర్‌జాయ్.. 8 రాష్ట్రాలకు అలర్ట్
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుపాను (Cyclone Biparjoy) తీరం దిశగా ముంచుకొస్తోంది. గురువారం సాయంత్రం ఈ తుపాను గుజరాత్‌లోని జఖౌ పోర్టు సమీపంలో తీరం దాటనుంది..
అయితే తీరం దాటే సమయంలో ఈ తుపాను భారీ నష్టం కలిగించే అవకాశమున్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో తీర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అటు గుజరాత్ (Gujarat)లోని కచ్, ద్వారక, సౌరాష్ట్ర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
కచ్, ద్వారక, పోర్‌బందర్, జామ్‌నగర్, మోర్బీ, జునాగఢ్, రాజ్‌కోట్ జిల్లాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశముందని ఐఎండీ (IMD) తెలిపింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా ఆశ్చర్యం లేదని పేర్కొంది. లోతట్టు ప్రాంతాలకు వరదముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి..
8 రాష్ట్రాల్లో వర్షాలు..
బిపోర్‌జాయ్ తుపాను (Cyclone Biparjoy) ప్రభావంతో గుజరాత్‌తో పాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలతో పాటు డామన్‌డయ్యూ, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. రాజస్థాన్‌లో జూన్ 16 నుంచి ఈ తుపాను ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జోధ్‌పుర్, ఉదయ్‌పుర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది..
Jun 14 2023, 14:42